సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నం పిల్లలు ఓ రొట్టెముక్కను ఉప్పులో నంజుకుని తింటున్న వీడియో ఒకటి ఇటీవల మీడియాలో హల్‌చల్ చేసింది. ఇది ఆ ఒక్క రోజు కనిపించిన దశ్యం కాదని, ఎప్పుడూ జరిగేదేనని ఆ దశ్యాన్ని వీడియో తీసిన హిందీ వార్తా పత్రిక ‘జనసంఘర్ష్ టైమ్స్’ జర్నలిస్ట్ పవన్ జైస్వాల్ తెలిపారు. ఈ వీడియో వార్తా కథనంపై తక్షణమే స్పందించిన మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ దార్యాప్తు జరిపి ఆ పాఠశాల అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని ఆదిత్యనాథ్ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే ఆశ్చర్యకరంగా గత ఆదివారం నాడు యూపీ పోలీసులు జర్నలిస్ట్ పవన్ జైస్వాల్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. వీడియో కథనం వెనక ఆయన నేరపూరిత కుట్రపన్నారంటూ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. పాఠశాల ఉన్న సియూర్ గ్రామ పెద్ద ప్రతినిధి అయిన రాజ్‌కుమార్ పాల్‌తోపాటు ఓ గుర్తుతెలియని వ్యక్తిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో రోటి, సోయాబీన్, ఇతర కూరగాయలు, లేదా రోటి, దాల్ లేదా పలావును తప్పనిసరిగా సర్వ్ చేయాలంటూ యూపీ ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలను సూచించింది. ప్రతి రోజు 450 గ్రాముల క్యాలరీలు, 12 గ్రాముల ప్రొటీన్లు విధిగా ఉండాలని కూడా నిర్దేశించింది.
యూపీలో బడి పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎక్కువగా బాధ పడుతున్నందున ఆహారం విషయంలో మార్గదర్శకాలు అవసరం అయ్యాయి. భారత దేశం మొత్తం మీద 4.66 కోట్ల మంది ఐదేళ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, ఈ విషయంలో భారత్ ప్రపంచంలోనే దిగువ నుంచి మూడో స్థానంలో ఉందని 2018లో విడుదలైన ‘ప్రపంచ న్యూట్రిషన్ రిపోర్ట్’ తెలియజేస్తోంది. బడి పిల్లల్లో పోష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అంటు రోగాల బారిన పడకుండా నిరోధించడంతోపాటు వారిని పాఠశాలలకు ఆకర్షించడానికి, వారిలో కుల, మత భేదాలు లేకుండా సామరస్యం పెంపొందించడానికి 1995లో కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ ఈ ‘మధ్యాహ్న భోజన పథకం’ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది.
ఈ స్కీమ్‌ను అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాల్లో అప్పుడప్పుడు అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. 2013లో బీహార్‌లో విషాహారం సరఫరా వల్ల 23 మంది బడి పిల్లలు మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో తనిఖీ నిర్వహించగా తెల్ల అన్నం, ఉప్పును మాత్రమే పెట్టిన ఘోరం బయట పడింది. యూపీలోని ఐదేళ్లలోపు పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నట్లు పలు నివేదికలు ఇప్పటికే బహిర్గతం చేశాయి. మధ్యాహ్న భోజనం పథకంలో లొసుగులను పూడ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం, పథకం అమలు తీరును బయటన పెట్టిన జర్నలిస్టుపై చర్య తీసుకోవడం ఏమిటో ఎవరికి అర్థంకాని విషయం.
పిల్లలకిస్తోన్న భోజనాన్ని ప్రశ్నించడం నేరమా?
Published Tue, Sep 3 2019 5:22 PM | Last Updated on Tue, Sep 3 2019 5:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment