లక్నో : ప్రభుత్వ పాఠశాలకు పంపితే చదువుతో పాటు.. మధ్యాహ్న భోజన పథకం ద్వారా తమ పిల్లల కడుపు కూడా నిండుతుందని ఆశపడే నిరుపేదలు కోకొల్లలు. విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ పథకానికి ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే వాటి ఫలాలు మాత్రం విద్యార్థులకు అందడం లేదని మరోసారి రుజువైంది. లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో గల ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాలు... మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా బుధవారం విద్యార్థులకు పాలు పంపిణీ చేస్తున్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఒకరు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో పెద్ద అల్యూమినియం పాత్రలో వేడి నీళ్లలో లీటరు పాలు కలిపి దాదాపు 81 మంది పిల్లలకు ఇవ్వడాన్ని గమనించారు. ఈ తతంగాన్నంతా వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఘటనపై స్పందించిన అధికారులు.. తమ వద్ద పాలు పంపిణీ చేయడానికి గేదెలు, ఆవులు లేవని పేర్కొన్నారు. పాల ప్యాకెట్ల సరఫరా ఆలస్యమైన కారణంగానే తప్పిదం జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే రోజు మళ్లీ పిల్లలందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక విద్యార్థులకు నీళ్ల పాలు పోసిన విషయం గురించి వంటమనిషి మాట్లాడుతూ... తనకు కేవలం ఒక ప్యాకెట్ పాలు మాత్రమే ఇచ్చారని.. అందుకే వాటిని అందరికీ సమానంగా పంచేందుకు నీళ్లు పోయాల్సివచ్చిందని పేర్కొంది. కాగా రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహా ఘటన జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. . ఈ క్రమంలో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే అతడు కుట్ర పన్నాడంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment