ఏపీ హామీల అమలుపై కేంద్రం దృష్టి పెట్టాలి: సోనియా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలు పెంచేందుకు అనువుగా తెచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు హామీలు ఇచ్చి తొమ్మిది నెలలైందని, వీటి అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రధానికి రెండుసార్లు విన్నవించానని చెప్పారు. తమ హయాంలో ఇచ్చిన హామీల అమలుపై ఎన్డీయే ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ కూడా ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనదని చెప్పారు.
ప్రత్యేక హోదాను రాజ్యసభలో ప్రకటించామని, అయితే, నాడు మోదీ, వెంకయ్యనాయుడు స్పందించలేదని వివరించారు. అదే పార్టీకి చెందిన సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా మాట్లాడుతూ తమ హయాంలో ఆంధ్రప్రదేశ్ కు చేసిన వాగ్దానాలపై కట్టుబడి ఉన్నామని చెప్పారు. దీనికి స్పందనగా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పునర్విభజన బిల్లులో పలు లోపాలున్నాయని అన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రానికి అందరూ మద్దతిచ్చారని చెప్పారు. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించిన సోనియాగాంధీ 2014వరకు ఎందుకు ఆగారాని ప్రశ్నించారు. కనీసం 9 ఏళ్ల తొమ్మిది నెలల్లోనైనా స్పందించడం హర్షణీయమని అన్నారు.