సాక్షి, ముంబై : ముంబై విశ్వవిద్యాలయం డిగ్రీ కళాశాలల్లో 10 శాతం సీట్లను పెంచడంతో వేల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారు. ట్రెడిషనల్ డిగ్రీ కోర్సులలో కూడా 10 శాతం సీట్లను పెంచేందుకు అన్ని కాలేజీలకూ అనుమతించింది. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు 15 శాతం సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచామని పేర్కొంది. మెరిట్ సాధించని విద్యార్థులకు ఈ విధానం ఎంతో దోహదకరంగా ఉంటుంది. ఇందుకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం తుది గడువు జూలై 15వ తేదీ వరకు పొడిగించారు.
ఈసారి అధిక శాతం విద్యార్థులు మంచి మార్కులు స్కోర్ చేయడంతో ఈ ఏడాది సీట్లు పెంచాల్సిందిగా నగరంలోని పలు కాలేజీలు డిమాండ్ చేశాయని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎం.ఎ.ఖాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని తీర్మానించింది. యూనివర్సిటీ అనుబంధ కళాశాలల మొత్తం సామర్థ్యం 1.3 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. కాలేజీలలో సీట్లు పెంచాలని ఇదివరకే 130 కళాశాలలు దరఖాస్తు చేశాయని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ముఖ్యంగా బీకాం, సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని తెలిపారు.
ఆఫర్ చేసిన సీట్లకంటే మూడింతలుగా విద్యార్థుల నుంచి కళాశాలలు దరఖాస్తులను స్వీకరించారు. చర్చ్‌గేట్‌లోని జైహింద్ కళాశాలలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులైన బీఎంఎం, బీఎంఎస్‌లకు 120 సీట్లు ఉండగా దాదాపు రెండు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీకాం కోర్సు కోసం హెచ్‌ఆర్ కళాశాల ఇతర కామర్స్ కళాశాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గతంలోనే కళాశాలలో 10 సీట్లు పెంచాలని పలు కళాశాలలు డిమాండ్ చేసినా ఇప్పుడు దీనికి మోక్షం లభించింది.
కొన్ని కాలేజీల విముఖత
ఇదిలా ఉండగా కొన్ని కాలేజీలు మాత్రం 10 శాతం సీట్లను పెంచేందుకు విముఖత చూపిస్తున్నాయి. 10 శాతం సీట్లను పెంచడంతో తరగతి గదుల్లో రద్దీ పెరుగుతోందనీ, అధ్యాపకులపై కూడా అదనపు భారం పడుతోందని సీట్ల పెంపునకు అంగీకరించడం లేదు. నగర వ్యాప్తంగా కాలేజీలలో చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయని విలేపార్లేలోని ఎన్‌ఎం కళాశాల ప్రిన్సిపల్ సునీల్ మంత్రి అభిప్రాయపడ్డారు. మరిన్ని సీట్లను పెంచడం సరికాదని తెలిపారు. కానీ డివిజన్లను పెంచి, అనుగుణంగా ప్రక్రియ మంజూరు చేస్తే ఉంటే బాగుంటుందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
వృథాగా అన్‌పాపులర్ కోర్సులు
సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కోర్సులలో 15 శాతం సీట్లను పెంచడంతో ప్రస్తుతం 60 మంది విద్యార్థులకు బదులు ఒకో డివిజన్‌లో 69 మంది విద్యార్థులు చేరవచ్చు. ట్రెడిషినల్ కోర్సులలో కూడా మామూలుగా కళాశాలల్లో 120 సీట్లు ఉండగా, 10 శాతం సీట్లు పెంచడంతో మరో 12 మంది విద్యార్థులను అదనంగా చేర్పించుకోవచ్చు. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం 1.3 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా, 60 వేల సీట్లు వృథాగా పడి ఉన్నాయి. అన్ పాపులర్ కోర్సులకు సంబంధించి చాలారోజులుగా నగరంలోని కళాశాలలో సీట్లు వృథాగా పడి ఉన్నాయని ఎం.ఎ.ఖాన్ తెలిపారు.
డిగ్రీ కళాశాలల్లో సీట్ల పెంపు
Published Tue, Jul 8 2014 11:46 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement
Advertisement