సాక్షి, ముంబై: రాష్ట్రంలో వచ్చే నెలలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు పర్వం శనివారం ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ వరకు వీరు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అయితే ఎంతో ఆర్భాటంగా కొనసాగాల్సిన నామినేషన్ల పర్వం మొదటిరోజు నిశ్శబ్దంగా ప్రారంభం కావడం గమనార్హం. ముంబై, శివారు ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల పరిసరాలన్నీ శనివారం బోసిగా కనిపించాయి.
సాధారణంగా నామినేషన్ వేసే అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు బ్యాండు మేళాలు, బాణసంచా పేలుస్తూ, బలాన్ని నిరూపించేందుకు భారీ జనాన్ని వెంటేసుకుని ఎంతో ఆర్భాటంగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటారు. కాని పితృపక్షాల కారణంగా అభ్యర్థులెవరూ నామినేషన్ వేసేందుకు కలెక్టర్ కార్యాలయం దరిదాపులకు రాలేదు. అలాగే ప్రధాన కూటములైన డీఎఫ్ (కాంగ్రెస్- ఎన్సీపీ), మహాకూటమి (శివసేన-బీజేపీ)లో సీట్ల సర్దుబాటు అంశం ఇంతవరకు కొలిక్కి రాలేదు.
దీంతో ఇరు కూటముల మధ్య పొత్తు కుదురుతుందా..? ఊడుతుందా..? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ ఊడితే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) ఏం పాత్ర పోషిస్తుంది... ఇలా రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అభ్యర్థి, ఏ నియోజక వర్గం పోటీచేస్తారనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. వీరిని పక్కన బెట్టినా కనీసం ఇండిపెండెంట్‌గా పోటీచేసే అభ్యర్థులు కూడా నామినేషన్ వేయడానికి ముందుకు రాలేదు. ఈ నెల 24తో పితృపక్షాలు పూర్తవుతాయి.
నామినేషన్లు వేసేందుకు ఈ నెల 27వ తేదీ ఆఖరు కావడంతో వారం రోజుల సమయం ఉంది. 25-27 తేదీల మధ్య నామినేషన్ల పర్వం జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. సమయం చాలా తక్కువగా ఉండడంవల్ల పోటాపోటీగా అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయాలకు తరలిరానున్నారు. దరఖాస్తులు స్వీకరించే అధికారులు ఉరుకులు పరుగులు తీయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్ణయ అధికారుల కార్యాలయాలను స్థాపించనున్నారు. ఈ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి 144 మంది ఐఏఎస్ అధికారులు మహారాష్ట్రకు చేరుకున్నారు.
సొంత బ్యాంకు ఖాతాలు...
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సొంతంగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. దరఖాస్తు ఫారంలో పొందుపర్చిన అన్ని కాలమ్‌లను పూర్తిచేయాల్సి ఉంటుం ది. ఏ ఒక్క కాలమ్‌నూ వదలకూడదని దరఖాస్తులో పొందుపరిచారు . తమ ఆస్తుల వివరాలు అఫిడెవిట్ (ప్రతిజ్ఞ పత్రం)లో కచ్చితంగా వెల్లడించాలి. దరఖాస్తుతోపాటు తమ సోషల్ అకౌంట్‌కు చెందిన యూఆర్‌ఎల్ నంబర్ కూడా రాయాలి.
డిపాజిట్ రెట్టింపు...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు డిపాజిట్ సొమ్ము రెట్టింపు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. గతంలో ఈ డిపాజిట్ రూ.ఐదు వేలు ఉండగా ఇప్పుడు రూ.10 వేలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.ఐదు వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
మొదటి రోజు మూడు నామినేషన్లు
నాందేడ్, న్యూస్‌లైన్: నామినేషన్ల పర్వం ప్రారంభమైన మొదటిరోజు నాందేడ్ జిల్లాలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తర నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పఠాణ్ జఫర్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా రెండు నియోజక వర్గాల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే దక్షిణ నాగపూర్ నియోజకవర్గానికిగాను ప్రజాస్వామిక లౌకిక పార్టీకి చెందిన అబ్దుల్ కరీమ్ అబ్దుల గఫార్ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ల ఘట్టం షురూ..
Published Sat, Sep 20 2014 11:35 PM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
Advertisement
Advertisement