సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు బెడిసి కొట్టినప్పటికీ మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో శివసేన పార్టీయే అధికారంలో కొనసాగుతుందని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు కొంకణ్ రీజియన్ మహామండలికి బీజేపీ లిఖిత పూర్వకంగా లేఖ అందజేసింది. దీంతో బీఎంసీ కార్పొరేషన్ లో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టమైంది.
బీఎంసీలో మహాకూటమి అధికారంలో ఉంది. ఒకవేళ పొత్తు ఊడితే తమ పరిస్థితి ఏంటనే దానిపై కార్పొరేటర్లు గందరగోళంలో పడిపోయిన విషయం తెలిసిందే. చివరకు ఊహించిన విధంగానే జరిగింది. కాని బీఎంసీలో అధికారం మిత్రపక్షమైన శివసేన వద్దే ఉంటుందని లేఖ ఇవ్వడంతో ఈ వాగ్వాదానికి తెరపడింది. ఒకవేళ బీఎంసీలో మహాకూటమి నుంచి బీజేపీ బయట పడాలంటే తమ కార్పొరేటర్లందరితో పదవులకు రాజీనామా చేయించాల్సి ఉంటుంది.
అప్పుడు మాత్రమే శివసేన సంఖ్యాబలం తగ్గి అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. 1997 నుంచి బీఎంసీలో శివసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సమితీ, ఇతర కీలక పదవులు వారివారి సంఖ్యాబలాన్ని బట్టి చేపడుతూ వస్తున్నాయి. బీఎంసీలో మొత్తం 227 మంది కార్పొరేటర్లున్నారు. అధికారం చేజిక్కించుకోవాలంటే 114 మంది కార్పొరేటర్ల బలం తప్పనిసరి . ఇందులో శివసేనకు 75, బీజేపీ 32, ఇండిపెండెంట్లు 12 మందిని కలుపుకొని 119 మంది కార్పొరేటర్లతో అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఇటీవల మేయర్‌గా ఎన్నికైన స్నేహల్ అంబేకర్‌కు మరో ముగ్గురు ఇండిపెండెంట్లు అదనంగా ఓట్లు వేయడంతో ఆమెకు మొత్తం 122 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం కూటమి నుంచి బీజేపీ బయటపడితే శివసేన ప్రభుత్వానికి 32 మంది కార్పొరేటర్ల బలం తగ్గిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి శివసేనను ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాని బీజీపీతోపాటు ఇండిపెండెంట్లు కూడా శివసేనకు మిత్రపక్షంగా ఉంటామని లిఖితపూర్వక హామీ ఇచ్చాయి. దీంతో బీఎంసీలో ఇరుపార్టీలకూ అధికారంలో వాటా ఉంటుంది. దీంతో బీజేపీ భవిష్యత్తులో శివసేనను ఇబ్బందిపెట్టే అవకాశం ఉండదని కార్పొరేటర్లు భావిస్తున్నారు.
బీఎంసీ .. యథాతథం!
Published Fri, Sep 26 2014 11:20 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement