ఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసరాల సేవలు మినహా అన్ని ప్రయాణాలు రద్దయ్యాయి. మార్చి 25 నుంచి కేంద్రం అన్ని రకాల విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ముందులాగే విమానాల్లో ప్రయాణం చేయడం అంత ఈజీ కాదని తెలుస్తుంది. కఠిన ఆంక్షలు, భద్రత మధ్యే ప్రయాణికులు విమానాలు ఎక్కనున్నారు.
(ధారావిలో కరోనా కేసుల తగ్గుముఖం)
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాల్సిందేనని, ఇది ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి కూడా అమలవుతుందంటూ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విమానంలో అందించే మీల్స్‌ను రద్దు చేయడంతో పాటు లావెటరీ(టాయిలెట్)లను కూడా పరిమితం సంఖ్యలో వాడనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల పట్ల కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర విమానాయాన శాఖకు లేఖ ద్వారా సమాచారం అందిచినట్లు తెలిసింది. ఒకవేళ మే 3 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే విమాన సేవలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులు ఎలాంటి సామాజిక దూరం పాటించకుండానే రోజుకు వందల సంఖ్యలో విమానాశ్రయాలకు పోటెత్తుతారు. దీంతో వారిని అదుపు చేయలేక పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది. కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చనే భావనతో లాక్‌డౌన్ తర్వాత కూడా కొన్ని రోజులు ఆంక్షలు కఠినతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. (లాక్‌డౌన్ వేళ.. ఏఈఓ హోంవర్క్)
ఇదే విషయమై ఒక సీఐఎస్‌ఎఫ్ అధికారి మాట్లాడుతూ.. 'కట్టుదిట్టమైన భద్రత మధ్యే ప్రయాణికులను అనుమతిస్తాము. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రయాణికులకు ముందుగా థర్మల్ స్క్రీనింగ్ చేస్తాము. వారికి ఎలాంటి లక్షణాలు , ఫ్లూ జ్వరం లాంటివి లేకపోతేనే టర్మినెల్‌కు వెళ్లేందుకు అనుమతిస్తాము. ఫేస్ మాస్క్‌ను ధరించని వారిని టర్మినెల్‌లోకి అనుమతించే అవకాశం లేదు. ప్రయాణికుల మధ్య సామాజిక దూరం పాటిస్తూనే వారిని విడతల వారిగా విభజించి అన్ని రకాల మెడికల్ టెస్టులు చేసిన తర్వాతే విమానం ఎక్కడానికి అనుమతిస్తాం.ప్రయాణ సమయంలో ప్రయాణికులకు కేవలం నీరు తప్ప ఎలాంటి స్నాక్, మీల్స్ అందించరు. విమానంలోని లావెటరీస్‌ను కూడా పరిమిత సంఖ్యలోనే వాడుతారని' వెల్లడించారు. దీనిపై ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment