దాడికి గురైన బస్సు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ బైక్ ను బస్సు తేలికపాటిగా తాకిందనే కారణంతో డ్రైవర్ ను కొట్టి చంపాడో యువకుడు. పశ్చిమ ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో పట్టపగలు ఓ 22ఏళ్ల యువకుడు డ్రైవర్ పై దారుణంగా దాడి చేసి మరణానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హర్యానాకు అశోక్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ ట్రాన్స్ పోర్ట కార్పోరేషన్(డీటీసీ)లో డ్రైవర్. ఎప్పటిలానే అశోక్ కుమార్ నిన్నకూడా విధులకు హాజరయ్యాడు. దీనిలో భాగంగా నాన్ ఏసీ బస్సును కరంపురా నుంచి బహుదుర్ ఘర్ కు తీసుకువెళుతున్నాడు.
ఆ క్రమంలోనే అటు పక్కగా ఓ యువకుడు మహిళతో కలిసి బైక్ పై వెళుతున్నాడు. ఆ సమయంలో బైక్ ను బస్సు తాకింది. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు బస్సు పై దాడికి పాల్పడి డ్రైవర్ ను తీవ్రంగా కొట్టాడు. ఆ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనపై డీటీసీ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి కోటి రూపాయిల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందుతున్ని అదుపులోకి తీసుకున్నట్లుపోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తిని విజయ్ గా గుర్తించినట్లుతెలిపారు.