
రేసులోనే ఉన్నాం: లవ్లీ
అసెంబ్లీ ఎన్నికలకు రాజధాని నగరం సిద్ధమవుతున్న తరుణంలో తాము కూడా రేసులో ఉన్నామని, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు రాజధాని నగరం సిద్ధమవుతున్న తరుణంలో తాము కూడా రేసులో ఉన్నామని, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఐక్యంగా ఉన్నాడని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆప్‌లను పూర్తి శక్తియుక్తులతో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ చెప్పారు. అధికారానికి దూరంగా ఉండటం తమ పార్టీకి కొత్తేమీ కాదన్నారు.
ఇంతకుముందు 1977లో కూడా తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని అన్నారని లవ్లీ గుర్తు చేశారు. కానీ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో రెండున్నరేళ్లలోనే మతోన్మాద శక్తులను అధికారం నుంచి త్రోసిపుచ్చామని లవ్లీ పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీలో ఎన్నికల సిద్దపాటు కోసం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో లవ్లీ మాట్లాడారు. అధికారం నుంచి కాంగ్రెస్ పార్టీ తప్పుకోవడంతో రాజధాని నగరం పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. తన 49 రోజుల పాలనలో ఆప్ ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేసిందని, తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను గాలికొదిలేసిందని విమర్శించారు.
ఇక బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల భద్రతపై తెగ ఆందోళన పడిపోయిందని, ఇప్పుడు మాత్రం ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తున్నా మౌనం పాటిస్తోందని లవ్లీ ఎద్దేవా చేశారు. పోలీసులపై జరుగుతున్న దాడులే క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి హరూన్ యూసుఫ్ మాట్లాడుతూ, ఢిల్లీలో మతోన్మాద, అవకాశవాద పార్టీలకు గుణపాఠం నేర్పేందుకు ముస్లిమ్‌లకు మరో అవకాశం రాబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.