
కాంగ్రెస్ -0
ఆప్ దెబ్బకు హస్తం ఔట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఆప్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమైంది! సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసి, పార్లమెంట్‌లో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని కాంగ్రెస్‌కు ఢిల్లీ ఎన్నికలు చుక్కలు చూపాయి. ఢిల్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరుగని పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోవడం ఢిల్లీలో ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్... 63 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. సీఎం పీఠంపై ఆశలు పెట్టుకోకపోయినా కొద్ది స్థానాలైనా వస్తాయని ఆ పార్టీ భావించింది. అందుకు తన వంతుగా గట్టి ప్రయత్నమే చేసింది. ఎన్నికల బరిలో కొత్త ముఖాలను దింపింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ర్యాలీలు నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. అధికారికంగా ప్రకటించకపోయినా ప్రచార కమిటీ చీఫ్ అజయ్ మాకెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు పంపింది. సదర్‌బజార్ నుంచి పోటీ చేసిన మాకెన్ కూడా డిపాజిట్ కోల్పోయి మూడో స్థానానికి పరిమితం కావడం పార్టీకి మింగుడుపడడం లేదు.
కేజ్రీవాల్‌పై పోటీకి దిగిన పార్టీ సీనియర్ నేత కిరణ్ వాలియా కూడా దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఇక గ్రేటర్ కైలాశ్ నుంచి బరిలోకి దిగిన రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ డిపాజిట్ కోల్పోయి 6,102 ఓట్లతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా పరిగణించే మైనారిటీలు కూడా ఈసారి చేయిచ్చారు. వారంతా ఆప్ వైపే మళ్లారు. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు నెగ్గితే అందులో ఐదు స్థానాలు మైనారిటీల సంఖ్య ఎక్కువున్నవే.
మాకెన్ రాజీనామా
ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి అజయ్ మాకెన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జి పీసీ చాకో, రాష్ట్ర పీసీసీ అధినేత అరవిందర్ సింగ్ లవ్లీ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి మంచి రోజు లు రావాలంటే భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పార్టీ నేత రాజీవ్ శుక్లా అన్నారు. కాగా, కాంగ్రెస్ పరాజయం నేపథ్యంలో... ప్రియాంక గాంధీ రాజకీయాలలోకి రావాలన్న డిమాండ్ మళ్లీ మొదలైంది. మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ప్రియాంకకు మద్దతుగా పార్టీ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు.