
సాక్షి, న్యూఢిల్లీ: పురుషులు అత్యాచారానికి గురైతే ఫిర్యాదు చేయడానికి వెనుకాడే పరిస్థితి ఉందని ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఐపీసీ 375, 376 సెక్షన్లు పురుషుల పట్ల వివక్ష చూపుతున్నాయని, మహిళలను ఇవి అపరాధులుగా చేర్చడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ సి హరిశంకర్ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత చట్ట నిబంధనలు మహిళను అత్యాచార బాధితురాలిగా, పురుషుడిని కేవలం నిందితుడిగా గుర్తిస్తున్నాయని.. లైంగిక హింస నేపథ్యంలో జెండర్ ఆధారంగా నేరాన్ని ఎలా అర్థం చేసుకుంటారని పిటిషనర్ సంజీవ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పితృస్వామ్య సమాజంలో పురుషులు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు మెదపలేకపోతున్నారని, మగాళ్లపై అత్యాచార ఘటనలు చాలా తక్కువే అయినా వాటిని విస్మరించలేమని అన్నారు. పురుషులు ఎవరైనా తమపై అత్యాచారం జరిగిందనే ఫిర్యాదు చేస్తే అతడిని సమాజం నిజమైన మగాడుగా గుర్తించదని వాపోయారు. రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కు, లింగ ఆధారంగా వివక్షను వ్యతిరేకించే ఆర్టికల్ 15 ప్రకారం మహిళలకు ఉండే హక్కులే పురుషులకూ వర్తించాలన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై న్యాయస్థానం అక్టోబర్ 23న విచారణ జరపనుంది.