న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇంటి వద్దకు మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసులో చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకే ఆయన నివాసానికి వచ్చినట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే చిదంబరం ఇంట్లో లేకపోవడంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
చిదంబరానికి భారీ షాక్..
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ షాక్ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఐఎన్‌ఎక్స్ మీడియా ముడుపుల కేసులో అరెస్ట్ అవకుండా ఉండేందుకు చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో మూడు రోజులపాటు అరెస్ట్ అవ్వకుండా చిదంబరంకు రక్షణ కల్పించాలని ఆయన తరఫు లాయర్లు కోర్టును కోరారు.
ఇప్పటికే చిదంబరంను కస్టడీకి కోరుతూ సీబీఐ, ఈడీలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌ను దర్యాప్తు సంస్థలు తప్పుబట్టాయి. విచారణ నుంచి తప్పించుకునేందుకు చిదంబరం ఇలా చేస్తున్నారని వారు కోర్టుకు తెలిపారు. మరోవైపు చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. హైకోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో.. ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. చిదంబరం తరఫు లాయర్లు ఈ రోజే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.
కాగా, ఐఎన్‌ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, ఇంద్రాణీ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల ఇంద్రాణీ అప్రూవర్‌గా మారారు.
Comments
Please login to add a commentAdd a comment