
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును మంగళవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఆగస్టు 25న గుర్మీత్ అరెస్ట్ అనంతరం అల్లర్లు రెచ్చగొట్టేందుకు హనీప్రీత్ ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్..పంచకుల కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను ఆలస్యం చేయడానికే హనీప్రీత్ హైకోర్టును ఆశ్రయించారని అభిప్రాయపడ్డారు. హనీప్రీత్ ముందున్న సులువైన మార్గం లొంగిపోవడమేనని తెలిపారు. తొలుత హనీప్రీత్ సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రిజర్వులో ఉంచింది. అయితే హనీప్రీత్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ, హరియాణా పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు.
హనీప్రీత్ తన బెయిల్ పిటిషన్‌లో ఢిల్లీలో ఇంటికి సంబంధించి తప్పుడు చిరునామా ఇచ్చి కోర్టును మోసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హనీప్రీత్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు హనీప్రీత్‌తో పాటు ఇద్దరు డేరా ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు వారెంట్‌తో ఢిల్లీ చేరుకున్న హరియాణా పోలీసులు పలుచోట్ల దాడులు చేశారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ బ్లాక్‌లో గుర్మీత్ పేరుపై ఉన్న ఇంటి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.