Honepreet Singh
-
హనీప్రీత్‌కు హైకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాన్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును మంగళవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఆగస్టు 25న గుర్మీత్ అరెస్ట్ అనంతరం అల్లర్లు రెచ్చగొట్టేందుకు హనీప్రీత్ ప్రయత్నించారని ఆరోపిస్తూ పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్..పంచకుల కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియను ఆలస్యం చేయడానికే హనీప్రీత్ హైకోర్టును ఆశ్రయించారని అభిప్రాయపడ్డారు. హనీప్రీత్ ముందున్న సులువైన మార్గం లొంగిపోవడమేనని తెలిపారు. తొలుత హనీప్రీత్ సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రిజర్వులో ఉంచింది. అయితే హనీప్రీత్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ఢిల్లీ, హరియాణా పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. హనీప్రీత్ తన బెయిల్ పిటిషన్లో ఢిల్లీలో ఇంటికి సంబంధించి తప్పుడు చిరునామా ఇచ్చి కోర్టును మోసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హనీప్రీత్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు హనీప్రీత్‌తో పాటు ఇద్దరు డేరా ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు వారెంట్‌తో ఢిల్లీ చేరుకున్న హరియాణా పోలీసులు పలుచోట్ల దాడులు చేశారు. ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ బ్లాక్‌లో గుర్మీత్ పేరుపై ఉన్న ఇంటి నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
హనీప్రీత్‌లా అందంగా ఉందంటూ వెంటాడి...
సాక్షి, పట్నా: ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్మీత్ రామ్ రహీమ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఇన్సాస్ కోసం రాష్ట్రాలన్నీ జల్లెడ పడుతున్నారు. నేపాల్ పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బిహార్ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారును వెంబడించారు. సుమారు 30 కిలోమీటర్లపాటు సాగిన ఛేజింగ్ అనంతరం కారును అడ్డగించగా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేసి ఫోర్బెస్గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే చివరకు ఆమె హనీప్రీత్ కాదని తేలింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆ కారులో ఉన్న ఓ అందమైన మహిళను చూసిన ధరానా ప్రాంత స్థానికులు హనీప్రీత్ అయి ఉంటుందని పోలీసులకు సమాచారం అందించారంట. దీంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై తప్పు తెలుసుకుని వదిలేశారు. అయితే ఆ ఛేజ్ సాగినంతసేపు స్థానిక మీడియాల్లో హనీప్రీత్ అరెస్ట్ అయిందని కథనాలు ప్రసారం కావటం విశేషం. కాగా, పట్నాకు చెందిన యువతి తన కుటుంబ సభ్యుడితో కలిసి వెళ్తుండగా ఇలా పోలీసులకు చిక్కి ఇబ్బందుల పాలయ్యింది.