కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 33ను ఉల్లంఘించాయని 3 కంపెనీలపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది.
న్యూఢిల్లీ: ప్రముఖ కళాకారుల సంగీతం, పాటలను బహిరంగ ప్రదేశాల్లో వినిపించడానికి కావాల్సిన లైసెన్సులను ఇవ్వడానికి తమకు హక్కులు ఉన్నాయని చెప్పుకుంటున్న మూడు కంపెనీలపై ఢిల్లీ హైకోర్టు ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 24 వరకు ఈ కంపెనీలు ఎవ్వరికీ లైసెన్సులు ఇవ్వకూడదని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ, ఫోనోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ లిమిటెడ్, నోవెక్స్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొసైటీలు కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 33ను ఉల్లంఘించాయని పిటిషన్ వేసిన సంస్థ ఆరోపించింది. కేసును ఏప్రిల్ 24కు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ రెండు సంస్థల రిజిస్ట్రేషన్ 2013 జూన్ 31కే పూర్తవ్వగా, నోవెక్స్ అసలు ఇప్పటిదాకా రిజిస్ట్రేషనే చేసుకోకుండా లైసెన్సులిస్తోందని పేర్కొన్నారు.
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో పై మూడు సొసైటీలకు భారీగా లైసెన్సు ఫీజలు రావాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులివ్వడంతో కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఉత్తర్వులపై స్పందించాల్సిందిగా కేంద్రం, కాపీరైట్ ఆఫీస్, మూడు సొసైటీలు, ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోషియేషన్స్ ఆఫ్ ఇండియాలకు నోటీసులిచ్చింది.