సాక్షి, న్యూఢిల్లీ : బీమా- కోరెగావ్ అల్లర్ల కేసులో గృహ నిర్బంధం ఎదుర్కొంటున్న గౌతమ్ నవలఖాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. గృహ నిర్బంధం నుంచి ఆయనను విముక్తుడిని చేస్తున్నట్లు జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ వినోద్ గోయల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రకటించింది. ఈ సందర్భంగా.. ‘ఈ కేసులో చీఫ్ మెట్రోపాలిటన్ రిమాండ్ ఆర్డర్ ఇవ్వలేదు. అలాగే పిటిషనర్ 24 గంటలకు మించి చాలా కాలం పాటు గృహ నిర్బంధం ఎదుర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేకం. అలాగే ఈ కేసులో రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు కూడా విస్మరించబడ్డాయి. కాబట్టి ఈ అంశానికి స్వస్తి పలకాల్సి ఉంది. కాబట్టి ఈరోజుతో ఆయన గృహ నిర్బంధం నుంచి విముక్తులయ్యారు’ అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.(చదవండి : ఒంటరిగా వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది!!)
కాగా మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆగస్టు 28న విరసం నేత వరవరరావు సహా పౌర హక్కుల నేతలు వెర్నన్ గొనెసాల్వేన్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖాలను పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరంతా కోర్టు ఆదేశాల మేరకు గృహనిర్బంధంలో ఉన్నారు. అయితే ఈ కేసులో అరెస్టైన పౌర హక్కుల నేతలు ఉపశమనం కోసం విచారణ కోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో గౌతమ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు అనుకూలంగా సోమవారం తీర్పు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment