
ఫైల్‌ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ చీఫ్ సెక్రటరీపై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. సీఎం కేజ్రీవాల్, ఆయన క్యాబినెట్ సహచరులను కలిశానని..ఇటీవలి దురదృష్టకర ఘటనను ఖండించానని..ఢిల్లీ అభివృద్ధి కుంటుపడకుండా అధికారుల్లో విశ్వాసం సడలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఎల్‌జీ బైజల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు ఎల్‌జీతో భేటీ అనంతరం కేజ్రీవాల్ అధికారుల తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశారు. గత మూడు రోజులుగా అధికారులు సమావేశాలకు హాజరవడం లేదని..దీంతో పాలన కుంటుపడిందని..అధికారులు తిరిగి విధులకు హాజరయ్యేలా చూస్తానని ఎల్‌జీ హామీ ఇచ్చారని కేజ్రీవాల్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ చీఫ్‌సెక్రటరీపై దాడి ఘటన సమసిపోకముందే మరో ఆప్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి అధికారులను కొట్టడమే వారికి తగిన శాస్తి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.