కుక్క కాళ్లను.. రంపంతో కోసేశాడు!
కుక్క కాళ్లను.. రంపంతో కోసేశాడు!
Published Wed, Dec 7 2016 12:13 PM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
వీధికుక్క తనను కరిచిందన్న కోపంతో ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి దాని కాళ్లను రంపంతో కోసిపారేశాడు. అయితే, ఈ నేరానికి అతడికి గరిష్ఠంగా 50 రూపాయల జరిమానా మాత్రమే పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. రెండు నెలల వయసున్న కుక్కపిల్ల ప్రమోద్ అనే నిరుద్యోగి ఇంట్లోకి ప్రవేశించింది. అతడు ఎప్పుడూ తాగి ఉంటాడని ఇరుగుపొరుగులు చెప్పారు. ప్రమోద్ కుక్కపిల్లను పిలిచి, దానికి కొంత ఆహారం కూడా వేశాడు. అయితే, ఆహారం తీసుకోవాలన్న తొందరలో.. ఆ కుక్కపిల్ల అతడి కాళ్లమీద తన ముందరి కాళ్లతో కొద్దిగా గీరింది. వెంటనే అతడికి కోపం వచ్చి, రంపం తీసుకుని దాన్ని ముందుగా కట్టేసి, ఒక ముందు కాలు, ఒక వెనక కాలు కోసేశాడని జంతువుల హక్కుల కార్యకర్త గౌరవ్ శర్మ ఆరోపించారు.
ప్రమోద్ ఇంటి సమీపంలో ఉండే ఓ బాలిక అతడి క్రూరత్వం గురించి తనకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం తెలిసిందని గౌరవ్ అన్నారు. కుక్కపిల్లను రక్షించడానికి తాను అక్కడకు వెళ్లగా, ప్రమోద్ భార్య జరిగిన విషయం మొత్తాన్ని వివరించిందన్నారు. కొన్ని నెలల క్రితం ప్రమోద్ ఒక కోతిని ఇంటికి తీసుకొచ్చి, తర్వాత దాన్ని నరికేశాడని కూడా ఆమె ఆరోపించింది. అయితే ఆ విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు.
తన భర్త ఎప్పుడూ తాగేస్తాడని, తనను, తన ఆరుగురు పిల్లలను చిత్రహింసలు పెడతాడని కూడా అతడి భార్య ఆరోపించింది. కొన్నిసార్లు వాళ్లను తలకిందులుగా వేలాడేస్తాడని చెప్పింది. ఆమె ఆరోపణల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అతడిని పోలీసులు అరెస్టుచేసి తీసుకెళ్లారు. ఇంతకుముందే ప్రమోద్ మీద ఒక గృహహింస కేసు నమోదైంది.
Advertisement
Advertisement