న్యూఢిల్లీ: పది మంది నడిచిన దారి కాకుండా, మీకంటూ కొత్త మార్గం ఏర్పరుచుకొని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఉందా ? అయితే ఢిల్లీలోని వివిధ యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్న నూతన కోర్సులను తప్పకుండా పరిశీలించాలి. విద్యార్థులను సామాజిక వ్యాపార, వైద్యం, విపత్తుల నిభాయింపు రంగంలో నిపుణులుగా మార్చేందుకు ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్స్‌స్థాయిలో సోషల్ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్, విపత్తుల నిభాయింపులో ఎంబీఏ, ఎర్లీ చైల్డ్‌కేర్, బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విదేశీ భాషలు తదితర కోర్సులను ప్రవేశపెట్టారు. ‘ఉదాహరణకు చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సును తీసుకుంటే దీనికి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది. శిశుసంరక్షణ కోసం గత ఏడాది ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించింది.
దీని అమలు చేసేందుకు ఈ కోర్సు చేసిన నిపుణులు చాలా మంది అవసరం’ అని ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) డీఎన్ వెనితా కాల్ అన్నారు. ఈ విధానం అమలు చేయడానికి ప్రభుత్వం జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉద్యోగులను నియమిస్తారని తెలిపారు. ‘శిశుసంరక్షణ, విద్యావిభాగం కోర్సు నిపుణుల కోసం ప్రపంచబ్యాంకు, యూనిసెఫ్, ప్లాన్ ఇండియా వంటి పేరొందిన సంస్థలూ వెతుకుతున్నాయి. స్కూళ్లకు కూడా వీరి సేవలు ఎంతో అవసరం’ అని కాల్ అన్నారు. సోషల్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ ఎం.ఎ., ఎం.ఫిల్ కోర్సులు కూడా ఏయూడీలో ఉన్నాయి. ‘సామాజిక రంగంలో వ్యాపార నిపుణులను తయారు చేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టారు. వీళ్లు విద్యార్థులకు ప్రాథమిక వ్యాపార నైపుణ్యాలను బోధిస్తారు’ అని ఏయూడీ అధికారి ఒకరు అన్నారు.
శిశుసంరక్షణలో ఎం.ఫిల్ చేసే విద్యార్థులైతే ఎనిమిది నెలలపాటు వెనుకబడ్డ రాష్ట్రాల్లోని గ్రామాల్లో పనిచేయాల్సి ఉంటుంది. రెండేళ్లపాటు ఈ కోర్సును అధ్యయనం చేయాలి. ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన 25 మందికి సీట్లు కేటాయిస్తారు. ఏయూడీతోపాటు గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ) కూడా బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే) వంటి నవతరం కోర్సులను అందజేస్తోంది. మనదేశంలో స్పీచ్ థెరపిస్టుల కొరత చాలా ఉందని ఈ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. జీజీఐయూతోపాటు ఎయిమ్స్‌లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. రిహాబిలిటేషన్ థెరపీ కోర్సుకు డిమాండ్ పెరుగుతోందని ఒక అధకారి అన్నారు.
జిల్లాస్థాయి ఆస్పత్రుల్లో రిహాబిలిటేషన్ థెరపీ నిపుణుల అవసరం ఎంతగానో ఉంద ని తెలిపారు. గ్రామస్థాయిల్లో పనిచేసే సామాజిక సేవకులకు వీళ్లు శిక్షణ ఇస్తారు. వినికిడి, దృష్టి లోపం, మానసిక వైకల్యం గ ల వారికి చికిత్స చేసే నైపుణ్యాలను కూడా ఈ కోర్సు అభ్యర్థులకు నేర్పిస్తారు. విపత్తుల నిభాయింపు (ఎంబీయే) కోర్సు తరగతులను వారానికోసారి నిర్వహిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, వాటి నిభాయింపు, సహాయక చర్యల గురించి విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలిగిస్తారు. కేంద్ర, రాష్ట్రస్థాయిల్లోనూ విపత్తుల నిభాయింపు ప్రాధికారసంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అత్యవసర ప్రణాళిక, నష్టం మదింపు, సామాజిక అభివృద్ధి, సామర్థ్యం పెంపు తదితర రంగాల్లో విస్తరించిన కంపెనీలకు కూడా ఈ కోర్సు అభ్యర్థుల అవసరం అధికంగా ఉంది. దక్షిణ మధ్య ఆసియాలోని పలు దేశాల్లో మాట్లాడే పష్తో భాష అధ్యయనంపై జామియా మిలియా యూనివర్సిటీలో అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు ప్రవేశపెట్టారు.
ఏ యూనివర్సిటీలో ఏ కోర్సు ?
అంబేద్కర్ యూనివర్సిటీ (ఏయూడీ) : మాస్టర్స్‌స్థాయిలో సోషల్ ఎంటర్ ప్రిన్యూర్‌షిప్, చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
గురు గోబింద్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (జీజీఐయూ): బ్యాచులర్‌స్థాయిలో రిహాబిలిటేషన్ థెరపీ, ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, విపత్తుల నిభాయింపు (ఎంబీయే)
జామియా మిలియా యూనివర్సిటీ : పష్తో భాష అధ్యయనంపై అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సు
నవతరానికి కొత్తబాట
Published Sun, Jul 6 2014 10:19 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement