
'మా నాన్న బట్టలూడదీసి దారుణంగా చంపారు'
న్యూఢిల్లీ: తన తండ్రి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరపాలని అనుకున్న ఢిల్లీకి చెందిన అంబిలి అనే మహిళా జర్నలిస్టుకు విషాదం ఎదురైంది. తన తండ్రి విజక్ కుమార్ ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బట్టలూడదీసి దారుణంగా హతమార్చి రక్తపుమడుగులో పడేసి వెళ్లారు. ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా తండ్రి నివాసానికి వెళ్లిన ఆమెకు ఈ భయంకర దృశ్యం కనిపించింది. దీంతో పోలీసులకు చెప్పగా వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి అంబిలి ఏం చెప్పిందంటే.. 'నేను ప్రతిరోజు మానాన్నకు ఫోన్ చేస్తుంటాను. కానీ ఎందుకో నిన్న మధ్యాహ్నం ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
దీంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లాను. ఇంటి తలుపు బద్దలు కొట్టినట్లు కనిపించింది. అనుమానం వచ్చి మరో రెండు అడుగులు లోపలికి వేశాను. మానాన్న బెడ్ రూం తలుపు కొంచెం తెరిచి ఉంది. లైట్స్ ఆపేసి ఉన్నాయి. టీవీ స్టాండ్ సోఫాలో పడి ఉంది. టీవీ లేదు. బాగా అనుమానం వేసి లైట్స్ ఆన్ చేసి మ్యాట్ కింద ఏదో కప్పి ఉన్నట్లు గమనించాను. ఆ దృశ్యం చూసి గుండె జారిపోయింది. మా నాన్నను ఒంటిపై నూలుపోగులేకుండా చేసి ఎవరో దారుణంగా చంపేసి రక్తపు మడుగులో పడేశారు. రెండు రోజుల్లో ఆయన పుట్టిన రోజు' అంటూ బోరుమని ఏడ్చింది. విజయ్ కుమార్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. 2011లో రిటైర్డ్ అయ్యారు. కేరళ నుంచి ఢిల్లీకి 1994లో వచ్చారు. ఆయన భార్య ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్లో పనిచేస్తుంది. అంబిలి రాజ్యసభ టీవీలో పనిచేస్తుంది. సోదరుడు కూడా దుబాయ్ లోజర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.