‘కట్టలు’ తెంచుకున్న ఆగ్రహం
► చెన్నై ఆర్బీఐ వద్ద బారులు తీరిన పెద్ద నోట్ల రద్దు బాధితులు
► ఆఖరి రోజు కావడంతో 2 కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు
► వందలాది మంది వచ్చినా.. ఒకే కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు
► మధ్యాహ్నం 2.30 గంటలకే దానినీ మూసివేసిన వైనం
► నోట్లు మార్చుకోలేక కన్నీళ్ల పర్యంతమైన బాధితులు
► కేంద్రానికి, ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘కష్టపడి సంపాదించిన సొమ్ము కాష్టం పాలేనా.. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం మా పొట్టకొట్టింది. బ్యాంకు ఆధికారులే మమ్మల్ని తప్పుదారిపట్టించి నిలువునా ముంచేశారు..’ శుక్రవారం చెన్నైలోని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రధాన కార్యాలయం పరిసరాల్లో ఏవైపు చూసినా కరెన్సీ బాధితుల గోడు ఇది. చెల్లని డబ్బుతో మేమేమి చేయాలంటూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు కన్నీళ్లపర్యంతమయ్యారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 8వ తేదీన పాత రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రద్దయిన నోట్లను డిసెంబర్ 31వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఇలా జమ చేసే మొత్తంపై సవాలక్ష షరతులు కూడా విధించింది. అలాగే డిసెంబరు 31లోపు తమ స్వస్థలాల్లోని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోలేని వారు ఈ ఏడాది మార్చి 31లోపు ఆర్బీఐ శాఖల్లో జమ చేసి తమ వ్యక్తిగత ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న భారతీయులు, ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) సైతం తగిన ఆధారాలతో తమ నగదును ఆర్బీఐలో మార్చుకోవచ్చని సూచించింది.
ఆర్బీఐ వద్ద అష్టకష్టాలు
రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు శుక్రవారం చివరి రోజు కావడంతో చెన్నై ఆర్బీఐ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పలు దక్షిణాది రాష్ట్రాలకు చెన్నై ఆర్బీఐ మాత్రమే దిక్కుకావడంతో తమిళనాడు సహా ఏపీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రెండు కిలోమీటర్ల పొడవున క్యూలో నిలుచున్న ఎక్కువ శాతం మందికి చివరికి నిరాశే మిగిలింది. విమానాశ్రయ కస్టమ్స్ అధికారి చేత స్టాంప్ వేయించుకుని ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించిన ఎన్నారైలకు మినహా మిగిలిన వారిని అనుమతించలేదు. దీనిపై ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా సమాధానం ఇచ్చేందుకు ఒక్క ఆర్బీఐ అధికారి కూడా అందుబాటులో లేరు. ఆర్బీఐ వద్దకు వచ్చే జనాన్ని అదుపు చేయడం కోసం నియమించిన పోలీసుల చేష్టల వల్ల అవమాన భారంతో కుంగిపోయిన కొందరు తమ చేతిలోని కరెన్సీని చింపివేసి వెళ్లిపోయారు.
‘డబ్బు తీసుకెళ్లి సముద్రంలో పడెయ్’
వందలాది మంది కరెన్సీ బాధితుల కోసం ఆర్బీఐ కేవలం ఒకే ఒక కౌంటర్‌ను, అది కూడా రోడ్డుపై ఏర్పాటు చేసింది. మండుటెండలో కిలోమీటర్ల పొడవున్న క్యూలో నిల్చుని తీరా కౌంటర్ వద్దకు చేరుకోగానే ‘నీవు అనర్హుడవు’ అంటూ అధికారులు నింపాదిగా చెప్పి పంపేశారు. ‘నేను ఓ విదేశీ నౌకలో కెప్టెన్‌ను. నోట్ల రద్దు సమయంలో ఇండియాలో లేను’ అంటూ నగదు మార్చుకోవాలని ఓ వ్యక్తి కోరగా.. ‘డబ్బు తీసుకెళ్లి సముద్రంలో పడేసెయ్’ అంటూ అక్కడి సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చారు. క్యూలో పెద్ద సంఖ్యలో జనం ఉన్నా సరిగ్గా 2.30 కాగానే కౌంటర్‌ను మూసివేశారు. దీంతో తమ గతేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ గేటు వద్ద గుమికూడారు. కరెన్సీ కట్టలను పైకెత్తి చూపుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.
రూ.1.74 లక్షలు పక్క కింద ఉంచుకొని నాన్న చనిపోయారు
మాది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, దూకులపాడు గ్రామం. పక్షవాతానికి గురై మాట్లాడలేని స్థితిలో ఉండే మా నాన్న జగన్నాథం (85) మార్చి 3న చనిపోయారు. శవాన్ని తొలగించినపుడు ఆయన పక్క కింద రూ. 1.74 లక్షల పాత కరెన్సీ ఉంది. నాన్నకు వచ్చే వృద్ధాప్య పెన్షన్, సాగు భూమి కౌలు కింద వచ్చిన నగదు పక్క కింద పెట్టుకునే ప్రాణాలు విడిచాడు. మాట్లాడలేని కారణంగా మాకు చెప్పలేదు. నాన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని, ఇతర సాక్ష్యాలను తీసుకొని ఈ నెల 22వ తేదీన చెన్నై ఆర్బీఐకి రాగా 29, 30, 31వ తేదీల్లో తీసుకుంటామని చెప్పి పంపేశారు. ఈ రోజు వస్తే కేవలం ఎన్నారైలకు మాత్రమే నగదు మార్చుకునే వీలుందని మోసం చేశారు. – అల్లు జగన్మోహన్‌రావు, శ్రీకాకుళం జిల్లా
అప్పు తీసుకుని.. పాత నోట్లు ఇచ్చారు
నేను ఎలక్ట్రికల్ వ్యా పారం చేస్తాను. వ్యాపారం లో భాగంగా అప్పుపై వస్తువులు తీసుకున్నవారు పాత నగదు చెల్లించారు. మార్చి 31వ తీదీ వరకు పెద్ద నోట్లను ఆర్బీఐలో తీసుకుంటారనే నమ్మకంతో వచ్చాను. ఎన్నారైల కంటే సామాన్య జనమే ఎక్కువగా వచ్చి వెళ్తున్నారు. – మురళి, నెల్లూరు
6 వేల కోసం వచ్చా..
నేను మార్కె టింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తాను. రూ. 6 వేల కోసం 400 కిలో మీట ర్ల దూరం నుంచి వ చ్చాను. లేనిపోని ప్రశ్న లు వేసి నగదు తీసుకునేందుకు బ్యాంకు అధికా రులు నిరాకరించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఫూల్స్ చేశారు. – కిశోర్, విజయవాడ
ఇదేనా భారతీయత?
ప్రధాని మోదీ చీటికి మాటికీ విదేశాల కు వెళ్లి మన భారత్, భారతీయత అని గొప్ప లు చెబుతుంటారు. దేశ పౌరులను ఇలా రోడ్లపాలు చేయడమేనా భారతీయత అంటే. నోట్ల రద్దు నిర్ణయంతో నష్టపోయిన వారంతా నల్లధనం ఉన్నవారా. ప్రధాని జవాబు చెప్పాలి. – సుధాకర్, విజయవాడ
వైద్యం కోసం దాచుకున్న సొమ్ము
మా అన్నకు మూగ, చెవుడు. పైగా శ్వాసకోస సమస్య ఉంది. నోట్ల రద్దు విషయం ఆయనకు తెలియదు. వైద్య ఖర్చుల కోసం వికలాంగుల పెన్షన్ కింద వచ్చే సొమ్మును దాచుకున్నాడు. గత నెలలో ఆస్పత్రికి వెళ్తే పాత నోట్లు చెల్లవనడంతో రూ. 23 వేలు నాకు ఇచ్చాడు. గత నెలలో చెన్నై ఆర్బీఐకి వస్తే.. వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని తర్వాత రమ్మన్నారు. ఈ రోజు వస్తే ఎన్నారైలకు మాత్రమేనని పంపేశారు.– వేణుగోపాల్‌రెడ్డి, నెల్లూరు