ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
ఆ రెండింటి వల్ల చెన్నై చితికిపోయింది!
Published Wed, Dec 14 2016 4:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
వర్దా తుఫాను సృష్టించిన బీభత్సానికి చెన్నపట్నం చెల్లాచెదురైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఇంటర్నెట్ సర్వీసులు ఆగిపోయాయి. మొబైల్ సేవలు స్తంభించాయి. అసలకే కేంద్రం తీసుకున్న పాత నోట్ల రద్దు నిర్ణయానికి తీవ్ర కష్టాల్లో ఉన్న చెన్నపట్న వాసులకు ఈ సేవలు నిలిపివేత తీరని కష్టాల్లో పడేసింది. కనీసం తిండి దొరకని పరిస్థితిలోకి నెట్టేసింది. ప్రతిసారీ చెన్నై పట్నాన్ని ముంచెత్తి వరదలకు ప్రజల నుంచి కనీస మద్దతు వారికి అందేది. ప్రజలు తామున్నామంటూ డబ్బులు వసూలు చేసి మరీ చెన్నైను ఆదుకునే వారు. అక్కడి ప్రజలు కూడా ఒక్కరికొక్కరు చేదుడువాదుడుగా నిలిచేవారు. కానీ ఈసారి చెన్నై పరిస్థితి భిన్నంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పాత నోట్లు రద్దయి ఉండటంతో వారికి కనీసం తిండి దొరకడానికి కూడా నగదు ఎక్కడి నుంచి పుట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. నగదు సాయానికి ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటున్నారు..
ఈ తుఫాను వల్ల తమకు జీవనాధారంగా ఉన్న బోట్లుకు ఎలాంటి హాని కలుగకూడదని వేడుకుంటున్నట్టు ఓ మత్స్యకారి చెప్పారు. ఒకవేళ అవి పాడైతే, వాటిని బాగుచేయించుకోవడానికి తమ దగ్గర నగదు కూడా లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. పాత నోట్లు రద్దయి ఉండటంతో ఈ సమయంలో సాయం దొరకడం కూడా కష్టమంటున్నాడు. తుఫానుతో విరిగిపడిన చెట్లకు తమిళనాడులో చాలా ప్రాంతాలు అంధకారంగా మారాయి. దీంతో నగరంలో ఏటీఎంలు సైతం పనిచేయడం లేదు. ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర విద్యుత్ ఉండి నడిచే ఏటీఎంలలో కూడా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయరని స్థానికులు చెబుతున్నారు. నెట్వర్క్లు డౌనయ్యాయి. తమ కార్డులు కూడా నిరూపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Advertisement
Advertisement