
పెద్ద నోట్ల రద్దుతో వీటి జాతకం అదుర్స్
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు వీధుల్లోకి వచ్చి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మాత్రమే క్యూలు కట్టడం లేదు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు వీధుల్లోకి వచ్చి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మాత్రమే క్యూలు కట్టడం లేదు. ఆన్‌లైన్ జాతక ఫలితాల కోసం కూడా క్యూలు కడుతున్నారు. తమ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయన్నదే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో కూడా చెప్పాలంటూ ప్రజలు వారి వెంట బడుతున్నారు. దిన, వార రాశి ఫలాలతోపాటు, బ్రహ్మరాత, హస్తవాశి, భవిష్యత్ ఎరుక చెబుతామంటూ ఇటీవలనే ఆన్‌లైన్‌లో వెలసిన జ్యోతిష్కులు, సంఖ్యాశాస్త్ర పండితులు అదరగొడుతున్నారు.
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నాటి నుంచి తమ వ్యాపారం 40 నుంచి 50 శాతానికి పెరిగిందని ఆస్క్మాంక్ డాట్ ఇన్, మాంక్వ్యాసా డాట్ కామ్, ఐజోఫి డాట్ కామ్, ఆస్ట్రోబడ్డీ లాంటి ఆన్‌లైన్ జాతక సంస్థలు తెలియజేస్తున్నాయి. ప్రతి రోజు తమకు 10, 20 మంది కస్టమర్లు ఫోన్ చేసేవారని, పెద్ద నోట్లు రద్దయిన నాటి నుంచి తమకు 30, 40 కాల్స్ వస్తున్నాయని ఆస్క్మాంక్ వ్యవస్థాపకులు వైభవ్ మాగన్ తెలిపారు. వ్యక్తిగత వ్యాపార లావాదేవీలు, ఆర్థిక పరిస్థితులతోపాటు ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశంపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారని ఆయన చెప్పారు. తమకు ఫోన్ చేస్తున్న వారిలో ఎక్కువ మంది కిరాణా వ్యాపారులు ఉన్నారని తెలిపారు.
తమ సంస్థను కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన ప్రశ్నలనే కాకుండా దేశ ఆర్థిక పురోగతి ఎలా ఉంటుందని కూడా అడుగుతున్నారని ఐజోఫి డాట్ కామ్ వ్యవస్థాపకులు రోహిత్ సింగానియా తెలిపారు. ప్రైమ్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ కంపెనీ ఆరు నెలలే క్రితమే కోల్‌కతా కేంద్రంగా ఈ జాతక సంస్థను ఏర్పాటు చే సింది. ఈ సంస్థ జాబితాలో 150 మంది జ్యోతిష్యులు ఉన్నారు. వారిలో ప్రముఖ తారో కార్డు రీడర్ (బొమ్మ కార్డులు చూసి జాతకాలు చెప్పడం) సీమా మీధా, ప్రముఖ జ్యోతిష్యుడు ఆర్కే శ్రీధర్లు ఉన్నారు.
తమకు కస్టమర్ల నుంచి రోజువారి వచ్చే కాల్స్ సంఖ్య రెట్టింపై వెయ్యి కాల్స్‌కు చేరిందని కోచి నుంచి పనిచేస్తున్న మాంక్వ్యాసా డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు దినూప్ కల్లేరిల్ తెలిపారు. 24 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సున్న వారే తమకు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారని ఆయన చెప్పారు. వోడాఫోన్, ఏయిర్‌సెల్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేసే ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఆర్సోబడ్డీ సంస్థకు రోజువారి కాల్స్ 20 వేల నుంచి 32 వేలకు పెరిగిందని వ్యవస్థాపకులు భూపేశ్ శర్మ తెలిపారు.
తమ కుటుంబం చిన్నాభిన్నమైందని, ఆర్థికంగా కుంగిపోయామని, వ్యాపారంలో భారీగా నష్టం వచ్చిందని, దీనికి పరిష్కారం చూపించాలంటూ....ఆర్థిక ఇబ్బందుల వల్ల సరకు సకాలంలో సరకు సరఫరా చేయకపోవడం వల్ల తనపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, ఇప్పుడు తనకు శిక్ష పడుతుందా? శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి?......అప్పుల్లో పీకలోతు వరకు కూరుకుపోయాను. బయట పడాలంటే ఏం చేయాలి? లాంటి ప్రశ్నలు కూడా కస్టమర్ల నుంచి వస్తాయని ఈ సంస్థలు తెలియజేస్తున్నాయి.
కస్టమర్లు అడిగే ఒక్కో ప్రశ్నకు, సూచించే పరిష్కారానికి ఈ జాతక సంస్థలు 300 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేస్తాయి. సాధారణ పశ్నలకు 300 నుంచి వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తే, కీలకమైన ప్రశ్నలకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయి. ప్రశ్నలడిగే ప్రజల జాతకాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఈ ఆన్లైన్ జాతక సంస్థల జాతకాలు మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.