నోట్ల రద్దు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు అనేది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఏఐసీసీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇది పేటిఎం వంటి చెల్లింపు సంస్థల స్కామ్ గా ఆయన అభివర్ణించారు. అవినీతి, నకిలీ నోట్ల నిర్మూలన, టెర్రర్ ఫైనాన్సింగ్లకు అడ్డుకట్ట వంటి లక్ష్యాలు పెద్దనోట్ల రద్దు వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రధాని మోదీ క్యాష్ లెస్ సొసైటీ అంటూ కొత్తడ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. సర్కస్లో రింగు మాస్టర్లా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు.
క్యాష్ లెస్ విధానంతో పేటిఎం వంటి చెల్లింపు సంస్థలకు వేలకోట్లు దోచిపెట్టాలని మోదీ చూస్తున్నారని అజోయ్ కుమార్ నిప్పులు చెరిగారు. పెద్దనోట్ల రద్దుకు ముందు, తర్వాత బీజేపీ నేతలు పెద్ద మొత్తంలో బ్యాంకులో డిపాజిట్లు చేసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ఆరోపించారు.అమిత్ షా డైరెక్టర్గా ఉన్న బ్యాంకులో రూ.500కోట్లు డిపాజిట్ అయిన అంశం పై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పలువురు బీజేపీ నేతలు, ఆ పార్టీ శాఖలు చేసిన భూ లావాదేవీలు, డిపాజిట్లు చూస్తుంటే మనీ లాండరింగ్ స్కామ్ను తలపిస్తోందన్నారు.సహారా, ఆదిత్య బిర్లా, సుధామ్షు సంస్థల నుంచి మోదీకి ముడుపులు ముట్టాయన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై జోక్లు వేయడం కాకుండా సమాధానం చెప్పాలని అజోయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆర్థికవేత్తలంతా మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు, అన్ని రంగాలకు నష్టం కలిగించేలా జరుగుతున్న మోదీ పాలనా తీరు ప్రజల్లో ఎండగట్టి మోదీని వెంటాడుతామన్నారు.