
గుర్మీత్‌ను గుడ్డిగా నమ్మి.. బావిలో శవమై..
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కారణంగా కొందరు పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరు ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తున్నారు.
న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ కారణంగా కొందరు పరోక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మరికొందరు ప్రత్యక్షంగా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొందరు ఆయనను నమ్మి మోసపోయి నిండు ప్రాణాలు బలితీసుకోవడం మొదలుపెట్టారు. గుర్మీత్‌ను నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డేరాలో పెద్ద మొత్తంలో నిర్మిస్తున్న హోటల్స్, రిసార్ట్స్ బిజినెస్‌లో భాగంగా దాదాపు రూ.3.10కోట్లు పెట్టుబడి పెట్టిన సోమ్‌వీర్ అనే వ్యక్తి తన నిండు ప్రాణం బలితీసుకున్నాడు.
లైంగికదాడి, మోసంవంటి కేసుల్లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక తాను పెట్టిన సొమ్మంతా బూడిదపాలయినట్లేనని భావించిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి 12 ఎకరాల భూమిని కూడా డేరాకు గుడ్డి నమ్మకంతో ఇచ్చాడు. బుధవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి శుక్రవారం ఓ బావిలో శవమై తేలాడు. పెట్టుబడి కోసం 25 ఎకరాల భూమిని అమ్ముకోవడమే కాకుండా 12 ఎకరాలను డేరాకు అప్పజెప్పి దెబ్బతిన్న నేపథ్యంలోనే తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.