అల్లర్ల కోసం ఐదు కోట్లిచ్చారు...
అల్లర్ల కోసం ఐదు కోట్లిచ్చారు...
Published Thu, Sep 7 2017 4:11 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
సాక్షి, పంచ్‌కుల : అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మిత్ రామ్ రహీం సింగ్ తీర్పు నేపథ్యంలో హింసాకాండకు దిగాలని మద్దతుదారులకు రూ 5 కోట్లు ముట్టచెప్పాడు. డేరా సచా సౌధా కీలక సభ్యులు ఆదిత్య ఇన్సాన్, హనీప్రీత్ ఇన్సాన్, సురేందర్ ధిమన్ ఇన్సాన్‌లను సిట్ సభ్యులు విచారించిన క్రమంలో ఈ విషయం వెలుగుచూసింది.
డేరా యాజమాన్యం నుంచి నిధుల వసూలు చేసి ఖర్చు చేయడంలో డేరా పంచ్‌కుల బ్రాంచ్ హెడ్ చంకూర్ సింగ్ కీలకంగా వ్యవహరించినట్టు సిట్ విచారణలో తేలింది.ఆగస్టు 28న హైకోర్టు ఆదేశాలతో చంకూర్ సింగ్‌పై దేశద్రోహం కేసు నమోదైనప్పటి నుంచి మొహాలి జిల్లా దకోలికి చెందిన చంకూర్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలో ఉన్నాడు. అత్యాచారం కేసులో గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం పంజాబ్‌లో అల్లర్లు చెలరేగిన పలు ప్రాంతాలకూ డేరా మేనేజ్‌మెంట్ హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు పంపినట్టు తెలిసింది.
హింసాకాండ సందర్భంగా మరణిస్తే అందుకు తగిన పరిహారం చెల్లిస్తామని తమకు హామీ ఇచ్చారని డేరా అనుచరులు తెలిపారు. చంకూర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత దీనిపై మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని, అతని కోసం తమ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని హర్యానా డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. ఆందోళనకారులకు వాహనాలు సమకూర్చేవారిపైనా నిఘా ఉంచామని తెలిపారు. అల్లర్లకు సంబంధించి ఓ ఉద్యానవన శాస్త్రవేత్త కీలకంగా వ్యవహరించారని, హింసను రెచ్చగొట్టేందుకు డబ్బులు కూడా సమకూర్చారని డీజీపీ చెప్పారు.
Advertisement