భక్తులను కాపాడుకునే పనిలో..!?
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అనుచరులు తమ భక్తులను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత.. వరుస పరిణామాలతో డేరా లోపలి అరాచకాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు గుర్మీత్‌కు దూరంగా జరిగారు. తమ పాలోవర్లను కాపాడుకోవడానికి గుర్మీత్ అనుచరులు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ ఇలా అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. డేరా హెడ్‌క్వార్టర్‌లోని ప్రధాన అనుచరులు గుర్మీత్ గురించిన ఆడియో, వీడియోలను వ్యక్తిగతంగానూ, గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నారు. అత్యాచారల కేసులు, కొత్తగా విచారణలోకి తీసుకున్న హత్యానేరాలను కుట్రగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు.
గుర్మీత్.. ఒక నిజమైన దేవదూత.. ఆయన మాత్రమే మన పాపాలను పోగొట్టగలడు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గుర్మీత్ ప్రఖ్యాతలు నచ్చని కొందరు.. ఆయనపై కక్ష్యగట్టి దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నారు.. అటువంటి వారి మాటలను నమ్మకండి.. అంటూ పాలోవర్లకు మెసేజ్‌లు వెళుతున్నాయి. కొందరు అనుచరులు వీటిని విశ్వసించి.. గుర్మీత్‌ను నమ్ముతుంటే.. మరికొందరు మాత్రం.. ఆయనను చీదరించుకుంటున్నారు.