Sirsa
-
రూ.1.6 లక్షలు: పేడలో బంగారం కోసం..
చండీగఢ్ : పొరపాటున చెత్త డబ్బాలో బంగారు ఆభరణాలు వేసి ఓ కుటుంబం ఇబ్బందుల పాలైంది. పోయిన బంగారాన్ని ఎద్దు పేడలో వెదుక్కుంటూ ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వింత ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాలు... జనక్‌రాజ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి సిర్సాలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబరు 19న జనక్‌రాజ్ భార్య, కోడలు వంట చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు శుభ్రం చేసుకునే నిమిత్తం ఓ పాత్రలో వేసి పక్కకు పెట్టారు. అయితే వంటపనిలో నిమగ్నమైన అత్తాకోడళ్లు.. కూరగాయల వ్యర్థాలతో పాటు ఆభరణాలు కూడా పొరబాటున ఇంటి బయట చెత్తబుట్టలో పడేశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఎద్దు చెత్తనంతా తినేసింది. ఈ విషయం గురించి జనక్‌రాజ్ మాట్లాడుతూ... ‘ ఆరోజు మా ఇంటి బయట చెత్త తిన్న ఎద్దును పట్టుకోవడానికి చాలా శ్రమించాం. దానిని పట్టుకున్న తర్వాత వెటర్నరీ డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం మా ఇంటి వద్దే కట్టేసి దానికి రోజూ తిండిపెడుతున్నాం. పేడలో బంగారు ఆభరణాలు వస్తాయేమోనని చూస్తున్నాం. దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయల బంగారం. అందుకే ఇంతలా బాధపడుతున్నాం. కొన్నిరోజులు ఇలా చూసిన తర్వాత ఎద్దును గోశాలకు అప్పగిస్తాం’ అని పేర్కొన్నాడు. దయచేసి చెత్త పారవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు విఙ్ఞప్తి చేశాడు. కాగా గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బెయిల్ పోలా వేడుకలో భాగంగా ఎద్దు ఓ మహిళ మంగళ సూత్రాన్ని మింగేయడంతో దానిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. వైద్యులు ఆపరేషన్ నిర్వహించి దానిని బయటకు తీశారు.(చదవండి : మంగళసూత్రాన్ని మింగిన ఎద్దు) -
భక్తులను కాపాడుకునే పనిలో..!?
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా మాజీ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అనుచరులు తమ భక్తులను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు. గుర్మీత్ అరెస్ట్ తరువాత.. వరుస పరిణామాలతో డేరా లోపలి అరాచకాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో చాలా మంది భక్తులు గుర్మీత్‌కు దూరంగా జరిగారు. తమ పాలోవర్లను కాపాడుకోవడానికి గుర్మీత్ అనుచరులు సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ ఇలా అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. డేరా హెడ్‌క్వార్టర్‌లోని ప్రధాన అనుచరులు గుర్మీత్ గురించిన ఆడియో, వీడియోలను వ్యక్తిగతంగానూ, గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నారు. అత్యాచారల కేసులు, కొత్తగా విచారణలోకి తీసుకున్న హత్యానేరాలను కుట్రగా చెబుతూ ప్రచారం చేస్తున్నారు. గుర్మీత్.. ఒక నిజమైన దేవదూత.. ఆయన మాత్రమే మన పాపాలను పోగొట్టగలడు అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గుర్మీత్ ప్రఖ్యాతలు నచ్చని కొందరు.. ఆయనపై కక్ష్యగట్టి దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తున్నారు.. అటువంటి వారి మాటలను నమ్మకండి.. అంటూ పాలోవర్లకు మెసేజ్‌లు వెళుతున్నాయి. కొందరు అనుచరులు వీటిని విశ్వసించి.. గుర్మీత్‌ను నమ్ముతుంటే.. మరికొందరు మాత్రం.. ఆయనను చీదరించుకుంటున్నారు. -
డేరాలో ఆయుధాల ఫ్యాక్టరీ
సాక్షి, సిర్సా: అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నిర్వహిస్తున్న డేరాలో ఆశ్రమానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. శుక్రవారం నుంచి హర్యానాలోని సిర్సా ఆశ్రమంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజా శనివారం జరిపిన సోదాల్లో ఆయుధాల తయారీ కర్మాగారం బయటపడింది. దీనిని చూసి ఆర్మీ, సోదాలు చేస్తున్న అధికారులు నెవ్వెరపోయారు. ఆయుధ తయారీ ఫ్యాక్టరీపై హర్యానా ఉన్నతాధికారి సతీష్ మెహ్రా స్పందిస్తూ.. ఆ ఫ్యాక్టరీని తక్షణం అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అంతేకాక పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో డేరా ఆవాస్ నుంచి మహిళా సన్యాసినులు నివాసముండే ప్రాంతానికవెళ్లే రహస్య రహదారిని గుర్తించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిపిన సోదాల్లో అస్తిపంజరాలు వెలుచూసిన విషయం తెలిసిందే. అంతేకాక నంబర్ ప్లేట్ లేని కోటిరూపాయల ఖరీదైన ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆయుధాలు అప్పగించిన ‘డేరా’ అనుచరులు
ఛండీగఢ్: డేరా బాబా అనుచరులు తమ వద్ద ఉన్న ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. సిర్సాలోని డేరా సచ్ఛా సౌదా ప్రధాన కార్యాలయంలో ఉన్న వివిధ రకాలైన 33 లైసెన్స్డ్ ఆయుధాలను అనుచరులు సిర్సా సదర్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్‌హెచ్‌వో దినేష్‌కుమార్ తెలిపారు. రేప్ కేసులో డేరా సచ్ఛా సౌదా ఛీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు ఇరవయ్యేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రహటక్లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గుర్మీత్ అరెస్ట్ అనంతరం ఆయన అనుచరులు పాల్పడిన అల్లర్లలో 41 మంది చనిపోవటంతోపాటు భారీ మొత్తంలో ఆస్తినష్టం సంభవించింది. ఈ నేపథ్యంలోనే సచ్ఛాసౌదా కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆశ్రమంలో ఉన్న పలువురు బాలలను విడిపించారు. అక్కడ జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తెచ్చారు. దీంతోపాటు డేరా అనుచరుల వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే అప్పగించాలని పోలీసులు అల్టిమేటం ఇచ్చారు. దీనికి స్పందించిన డేరా అనుచరులు సోమవారం తమ వద్ద ఉన్న సింగిల్ బ్యారెల్, డబుల్ బ్యారెల్ తుపాకులతోపాటు 9మిమీ పిస్టళ్లను పోలీసులకు అప్పగించారు. -
‘డేరా’ ఖాళీ అవుతోందిలా..!
సిర్సా(హర్యానా): పటిష్ట బందోబస్తు మధ్య డేరా సచ్ఛా సౌద భవనాల్లో ఉన్న సిబ్బందిని, అనుచరులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సుమారు 700మందిని బయటకు తీసుకువచ్చారు. బాబా గుర్మీత్ రాం రహీం సింగ్‌కు రేప్ కేసులో శిక్ష ఖరారైన తర్వాత గత రెండు రోజులుగా పంజాబ్, హర్యానాల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరుగలేదని అధికారులు వెల్లడించారు. సిర్సాలోని డేరా కొత్త ప్రధాన కార్యాలయంలో ఇంకా 200మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారమని డిప్యూటీ కమిషనర్ ప్రభ్‌జ్యోత్ సింగ్ తెలిపారు. వారిని కూడా క్రమంగా బయటకు తీసుకువస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే డేరా పాత కార్యాలయంలో ఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి, ఇళ్లకు పంపించామని చెప్పారు. డేరా సిబ్బంది సహకారం తీసుకుని వారిని బస్సుల్లో సొంతూళ్లకు పంపామన్నారు. సిబ్బంది అంతా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన వారేనని అన్నారు. అంతేకాకుండా 18 మంది బాలికలను 34 మంది బాలురను బయటకు తీసుకువచ్చామని చెప్పారు. అయితే, వారు అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇళ్లకు వెళ్లాలనుకున్న వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను ప్రభుత్వ ఆశ్రమకేంద్రాల్లో చేర్పిస్తున్నామన్నారు. వాళ్లంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. డేరా నిర్వాహకులు తమకు ఈ విషయంలో సహకరిస్తున్నారని చెప్పారు. డేరా ప్రధానకార్యాలయం చుట్టూ 500 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, సైన్యం, పోలీసు పహారా కాస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచి సిర్సాలో కర్ఫ్యూ సడలించారు. కాగా, ఇప్పటివరకు 6,500మంది డేరా అనుచరులను బయటకు రప్పించి వారిని బస్సుల్లో ఇళ్లకు పంపినట్లు సమాచారం. -
'డేరా' నుంచి 18 మంది బాలికలకు విముక్తి
రోహతక్: లైంగిక వేధింపులు కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ జైలుకు వెళ్లడంతో ఆయన ఆశ్రమంలోని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం నుంచి 18 మంది బాలికలను స్థానిక అధికారులు రక్షించారు. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 15 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో గుర్మీత్‌కు సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలో అధికారులు సోదాలు చేపట్టారు. డేరా కార్యాలయంలో వెయ్యి మంది వరకు ఉన్నట్టు గుర్తించారు. వీరందరినీ బయటకు పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సిర్సాలో భద్రత కొనసాగుతోంది. గుర్మీత్ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు దిగకుండా భారీ ఎత్తున భద్రతా దళాలను మొహరించారు.