ఆయనో మార్గదర్శి, రుషి: రాజ్ నాథ్
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్ అవమానాలకు గురైనా ....భారతదేశాన్ని వదిలి వెళ్లాలనుకోలేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అంబేడ్కర్ భారతదేశానికి మార్గదర్శి, ఓ రుషి అంటూ అభివర్ణించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గురువారం లోక్సభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ నిష్పక్షపాతంగా, విమర్శలకు తావులేకుండా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు.
భారత జాతిని ఏకతాటిపై నిలిపిన మహానుభావుడని రాజ్నాథ్ కొనియాడారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయనను దళిత వర్గానికి చెందిన నాయకుడిగా సంకుచిత దృష్టితో చూడటం సరికాదన్నారు. సమానత్వం కోసం రిజర్వేషన్లను పరిచయం చేసింది అంబేడ్కరేనని అన్నారు.
అనేక జాతీయ సంస్థలకు నెలకొల్పేందుకు అంబేడ్కర్ సహకరించారన్నారు. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అంతకు ముందు స్పీకర్ సుమిత్రా మహాజన్....లోక్సభలోఅంబేడ్కర్ సేవలను కొనియాడారు. అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక దేశమని, సమానత్వానికి అంబేడ్కర్ పెద్దపీట వేశారని ప్రశంసించారు.