
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో గత 30-35 సంవత్సరాల నుంచి ఉగ్రవాద కార్యకలపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కానీ భద్రతా దళాల కారణంగా వాటికి తెరపడిందని లోక్‌సభలో రక్షణ మంత్రి పేర్కొన్నారు. అంతేకాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కట్టడికి ఆర్మీ, పారా మిలటరీ దళాలతో పాటు అక్కడి పోలీసులు సమన్వయంతో పని చేస్తున్నారని అభినందించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్ పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ లోక్‌సభలో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితిలో లేవని.. ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో కొంతమంది చనిపోయారని అన్నారు. ప్రభుత్వం సభను పక్కదోవ పట్టిస్తోందని, ఈ విషయమై ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
జమ్మూకశ్మీర్ అంశమై నవంబరు 20న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితిలో ఉన్నాయని, ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి పోలీసుల కాల్పుల్లో ఒక్క వ్యక్తి కూడా మరణించలేదని పేర్కొన్నారు. సభలో ఉన్నవారు జమ్మూకశ్మీర్‌లో రక్తపాతాన్ని అంచనా వేస్తున్నారని తప్పుపట్టారు. అక్కడి పోలీసులపై రాళ్లు రువ్వడం తగ్గడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment