
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమీపంలో అనూహ్య పరిణామం చేటుచేసుకుంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాన్వాయ్‌కి ఓ వ్యక్తి అడ్డుపడ్డాడు. వాహనశ్రేణికి ఎదురుగా వచ్చి ప్రధాని మోదీని కలవాలంటూ నినాదాలు చేశాడు. హఠాత్ పరిణామంతో షాక్ తిన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజ్‌నాథ్ కాన్వాయ్ ముందుకు సాగింది.
దద్దరిల్లిన లోక్‌సభ
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై... లోక్‌సభ రెండోరోజూ దద్దరిల్లింది. అధిర్ క్షమాపణలకు బీజేపీ డిమాండ్ చేసింది. సభలో తమ స్థానాల్లో నిలబడి బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేశారు. అధిర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రధాని మోదీ, అమిత్ షా వలసదారులని, నిర్మలా సీతారామన్ నిర్బల సీతారామన్ అని నిన్న లోక్‌సభలో వ్యాఖ్యానించారు అధిర్ రంజన్ చౌధురి. దీనిని తీవ్రంగా పరిగణించిన బీజేపీ... ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నిరసనకు దిగింది.