ఢిల్లీ: లోక్‌సభ అలజడి ఘటన కేసులో మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమావత్ అనే వ్యక్తిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. గంట సేపు ప్రశ్నించిన అనంతరం.. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ ప్రకటన చేశారు. ఈ కుట్రలో మహేష్ కూడా భాగం అయ్యాడని పేర్కొంటూ.. కేసులో ఆరో నిందితుడిగా అతని పేరును చేర్చారు.
రాజస్థాన్ నాగౌర్ జిల్లాకు చెందిన మహేష్.. ఘటన జరిగిన తేదీన ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నలుగురిని తొలుత అరెస్ట్ చేశారు. అయితే వాళ్లకు సహకరించడం, వాళ్ల ఫోన్లను ధ్వంసం చేయడం లాంటి అభియోగాల మీద లలిత్ ఝా అనే వ్యక్తిని ఇది వరకే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కుట్ర కేసులో లలిత్‌నే కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు.
ఇద్దరూ లొంగుబాటు
గురువారం లలిత్‌తో పాటు మహేష్ కూడా లొంగిపోయినట్లు తెలుస్తోంది. లలిత్ అరెస్ట్‌ను శుక్రవారం పోలీసులు నిర్ధారించగా.. మహేష్‌ను, అతని బంధువు కైలాష్‌ను సైతం ప్రశ్నించిన పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే శనివారం మరోసారి మహేష్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాతే అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
పార్లమెంటులో ఘటనల అనంతరం లలిత్ ఝా ఢిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయాడు. అక్కడ మహేష్ అతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. నలుగురు నిందితుల ఫోన్లను ధ్వంసం చేసేందుకు లలిత్‌కు మహేష్ సహకరించాడని పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. లలిత్‌తో పాటు మహేష్‌ను కూడా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఢిల్లీ నుంచి రాజస్థాన్‌లో వాళ్లు తిరిగిన ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు. అలాగే.. పార్లమెంట్‌లోనూ ‘సీన్ రీక్రియేషన్’ చేయనున్నట్లు తెలుస్తోంది.
మరో ప్లాన్‌తో..
పార్లమెంట్ శీతాకాల సమాశాల్లో భాగంగా.. డిసెంబర్ 13వ తేదీన లోక్‌సభలో జీరో అవర్ కొనసాగుతుండగా ఒక్కసారిగా అలజడి రేగింది. ఇద్దరు వ్యక్తులు పబ్లిక్ గ్యాలరీ నుంచి వెల్ వైపుగా దూసుకెళ్లే యత్నం చేశారు. అయితే నిలువరించిన ఎంపీలు.. వాళ్లను చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈలోపు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కలర్ స్మోక్ షెల్స్‌ను ప్రయోగించారు. అదే సమయంలో బయట కూడా ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తూ కనిపించారు. వాళ్లనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా నిందితులు విస్తూపోయే వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లోక్‌సభలో అలజడి ఘటనలో నిందితులు తొలుత తమకు తాము నిప్పంటించుకోవడం వంటి ప్రణాళికలూ రూపొందించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. చివరకు ఆ ప్రయత్నాలను విరమించి, బుధవారం అమలు చేసిన ప్లాన్‌తో ముందుకెళ్లినట్లు తెలిపారు. మరోవైపు.. ఈ కేసులో ఇద్దరు నిందితులకు విజిటర్ పాసులు జారీ చేసిన భాజపా ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment