లక్నో: కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని. చావు పుట్టుకల నుంచి విముక్తి లభిస్తోందని కొంతమందిలో నమ్మకం. ఆ భావనతోనే చనిపోయేందుకు కాశీ వెళుతున్నారు. కాశీకి వెళ్లిన వాళ్లు కాటికి వెళ్లిన వాళ్లు ఒక్కటే అని గతంలో ఓ నానుడి ఉండేది..అయితే కాటికి వెళ్లేందుకే ఇప్పుడు చాలా మంది కాశీకి వెళుతున్నారు. మోక్షం కోసం వచ్చే ఇలాంటి వారికి వసతి కల్పించేందుకు అక్కడ ప్రత్యేకంగా భవనాలు కూడా ఉన్నాయి.
చనిపోయే వారి కోసం ముక్తి భవన్
పారిశ్రామికవేత్త విష్ణుహరి దాల్మియా 1958లో ఈ ముక్తి భవన్‌ను ప్రారంభించారు. కాశీలో చనిపోవాలని వచ్చే వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. చావుకు దగ్గిరగా ఉన్న వాళ్లు ఇక్కడికి వస్తారు. ముక్తి భవన్‌లో ఉచితంగానే వసతి కల్పిస్తారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి. వీరికి ఓ రూమ్ కేటాయిస్తారు. కనీసంగా 15 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ లోపు చనిపోతే సరేసరి. లేదంటే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, రూమ్‌ల ఖాళీని బట్టి మరోసారి వసతి అవకాశం ఇస్తామని నలభై ఏళ్లుగా ముక్తి భవన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేనేజర్ భైరవ్‌నాథ్ శుక్లా తెలిపారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
కాశీలో చనిపోవాలనే తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ కుమారుడు తండ్రిని తీసుకుని మోక్ష భవన్‌కు వచ్చాడు. అయితే అక్కడ కుమారుడు చనిపోయాడు. తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. మరో సంఘటనలో ఓ కొడుకు తన తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. పదిహేను రోజులు అక్కడే ఉన్నా తండ్రి చనిపోలేదని కొడుకు విసుగ్గా ఆ తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తండ్రి కనీసం మరో ఐదేళ్లు బతికే అవకాశం ఉందని, ఇలా రకారకాల ఆలోచనలతో ఇక్కడికి వస్తుంటారని శుక్లా తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కాశీభవన్‌లో తన ఆఖరి మజిలీని గడుపుతున్నారు. వీరిరువురూ విద్యాశాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరచుగా కాశీ వెళ్తుండేవారు. రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చి కాశీ భవన్‌లో ఓ గదిని తీసుకున్నారు. మిగతా జీవితాన్ని అక్కడే సంతోషంగా గడిపేస్తామని చెబుతున్నారు.
20 ఏళ్లుగా అక్కడే నివాసం
అస్సీ ఘాట్‌కు సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ముముక్షు భవన్ ఉంది. ఇందులోనే ప్రాథమికోన్నత పాఠశాల, ఓ గుడి, 60 రూములు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన గులాబ్ బాయ్ అనే మహిⶠ20 ఏళ్లుగా ఈ భవన్‌లోనే ఉంటున్నారు. భర్త మరణానంతరం తన కోరిక మేరకు పిల్లలు ఇక్కడికి తీసువచ్చి వదిలి వెళ్లారని, ఢిల్లీలో కంటే ఇక్కడే తనకు హాయిగా ఉందంటున్నారు గులాబ్. పైగా, ఢిల్లీలో నివశించేవారికి రక్షణ లేకుండా పోయిందని, అక్కడ జరుగుతున్న హత్యల వార్తలను టీవీల్లో చూస్తున్నానని చెప్పారు. ‘ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తోందని చాలామంది ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అయితే కొన్ని లాడ్జీలు చావులను వ్యాపారంగా మార్చేశాయని’ సీనియర్ జర్నలిస్ట్ అమితాబ్ భట్టాచార్య విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment