న్యూఢిల్లీ: ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సాహం కోసం హెక్టారుకు రూ. 50,000 పెట్టుబడి సాయం కేంద్రం నుంచి ఉంటుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీ కృషి భవన్‌లో అగ్రికల్చర్ సెక్రెటరీ ఆధ్వర్యంలో అన్ని స్థాయిల అధికారులతో అరవింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు పంట.. విత్తనాల నుంచి ఎరువులు, సాగు ఖర్చు, యంత్ర పరికరాల వినియోగం, కూలీల ఖర్చు, దిగుబడి, స్టోరేజ్, మార్కెట్ వ్యవస్థ తోపాటు మార్కెట్‌లో పంట అమ్మకం వరకు జరిగే ప్రక్రియ గురించి అధికారులు, రైతులతో అరవింద్ కూలంకుషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, జగిత్యాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలోని పసుపు పంటకు సంబంధించి అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించామని అరవింద్ వెల్లడించారు.
పసుపు పంట ఎగుమతి జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్‌లను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న 50 అర్గానిక్ ఫార్మింగ్ క్లస్టర్లలో చేర్చిందని ఆయన తెలిపారు. ఈ క్లస్టర్స్‌లో ఉండటం వల్ల కోల్డ్ స్టోరేజీలకు కావాల్సిన సాయం కూడా అందనుందని పేర్కొన్నారు. అంతే కాకుండా పసుపు పంట కోసం విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు కావల్సిన సాయంతో పాటు ట్రైనింగ్, యంత్ర పరికరాల వాడకం, సరఫరా, మార్కెటింగ్ లాంటి అంశాల మీద అవగాహన కల్పించనున్నారని పేర్కొన్నారు.
పసుపు పంట బరువు తగ్గకుండ కుర్కుమిన్ శాతం పెంచే విధంగా విత్తన సరఫరా కూడా చేస్తున్నామన్నారు. దీంతోపాటు మార్కెటింగ్ కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన ట్రేడర్స్‌ను నిజామాబాద్‌కు తీసుకువస్తామని.. పంటలో కుర్కుమిన్ శాతం వెంటనే తెలుసుకోవడం కోసం మార్కెట్‌లోనే ల్యాబ్‌లను ఏర్పాటు చేసేలా చర్యలను తీసుకుంటామన్నారు. అవసరమైతే దీని కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా పసుపు బోర్డు, మద్దతు ధర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అరవింద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment