పసుపు పంటకు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి నిజామాబాద్ ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె గురువారం ప్రధానితో సమావేశమై పసుపు పంట బోర్డు ఏర్పాటు ఆవ శ్యకతను వివరించారు. ప్రపంచ స్థాయిలో అధిక మొత్తంలో సాగును కలిగి ఉన్న పసుపు పంటను భారతదేశంలో గత 20 ఏళ్లుగా పట్టించుకోనేవారు కరువయ్యారన్నారు.
పంట సాగు రైతులకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నారని చెప్పారు. పసుపు పంటకు ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం వల్ల సాగులో నూతన పద్ధతులను ఉపమోగించి ఉత్పత్తిని పెంచవచ్చని వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత రెండే ళ్లుగా బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నానని, మహారాష్ట్ర, కేరళ ముఖ్యమంత్రులతో కూడా చర్చించి వారి నుంచి కూడా మద్దతుగా ప్రధానికి లేఖలు ఇప్పించానని కవిత తెలిపారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోరుకుంటున్నారని, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ‘దేశంలో పసుపు లేని ఇళ్లు లేదు. అమెరికా కూడా పసుపు పంటపై పేటెంట్ హక్కులు పొందడానికి ప్రయత్నించినా.. అప్పుడు పోరాడి మన దేశం హక్కులను సంపాదించింది. పసుపు లాంటి పురాతన సుగంద ద్రవ్యాలను కాపాడుకోవాలంటే.. అది ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు ద్వారానే సాధ్యపడుతుంద’ని ఆమె పేర్కొన్నారు. ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని కవిత చె ప్పారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి మోదీ కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.