దిమాపూర్: నాగాలాండ్లోని దిమాపూర్లో ప్రజల ఆగ్రహావేశాలకు ప్రాణాలుకోల్పోయిన అత్యచార నిందితుడి అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రికత్త పరిస్థితులు ఉండటం, అసోం, నాగాలాండ్ మధ్య ఈ విషయం కాస్త వివాదాలకు దారితీయడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య బల్క్ ఎస్సెమ్మెస్లను పోలీసులు నిషేధించారు.
సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్గా పనిచేస్తున్న సయ్యద్ ఫరీద్‌ఖాన్ (35) అనే వ్యక్తి ఇరవయ్యేళ్ల నాగా యువతిపై గతనెల 23, 24 తేదీల్లో వేర్వేరు ప్రదేశాల్లో అత్యాచారం చేసినట్లు కేసునమోదైంది. అనంతరం ఫిబ్రవరి 25న అతన్ని పోలీసులు అరెస్టు కోర్టులో అప్పజెప్పగా అతడిని సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే, ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ప్రజలు నిందితున్ని జైలు నుంచి బయటకు ఈడ్చి కొట్టి చంపారు.