
ఎన్నికలు ముగియగానే.. డీజిల్ ధర పెంపు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశ అలా ముగిసిందో.. లేదో, కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను అమాంతం పెంచేసింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశ అలా ముగిసిందో.. లేదో, కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను అమాంతం పెంచేసింది. ప్రతిసారీ లీటరుకు 50 పైసల వంతునే పెంచుతుండగా, ఈసారి మాత్రం ఒకేసారి రూ. 1.09 చొప్పున పెంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచే పెరిగిన డీజిల్ ధరలు అమలులోకి వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, దీనికి వ్యాట్, అమ్మకం పన్నులు ఇవన్నీ అదనం కాబట్టి రాష్ట్రాల్లోను, నగరాల్లోను కూడా ఈ ధరలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో ఈ పెంపు లీటర్కు రూ. 1.22 కాబోతోంది.
ముంబైలో ఇన్నాళ్లూ లీటర్ డీజిల్ రూ. 63.86 మాత్రమే ఉండగా, ఇప్పుడది రూ. 65.21 అయ్యింది. ఎన్నికలకు ముందు ఏప్రిల్ 1, మే 1 తేదీల్లో ప్రతినెలా పెంచాల్సిన ధరలు పెంచలేదు. అసలే యూపీఏ పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉండటంతో.. డీజిల్ ధర పెంచితే మరింత ఇబ్బంది అవుతుందని ఆగిపోయారు. ఇప్పుడెటూ ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి ఇక నష్టం లేదని ఇప్పుడు పెంచేశారు. 2013 జనవరి నుంచి 14 విడతల్లో డీజిల్ ధర లీటరుకు రూ. 8.33 పెరిగింది. అయితే పెట్రోలు ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు.