‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే! | Disclose all names of foreign bank account holders: Supreme Court | Sakshi
Sakshi News home page

‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే!

Published Wed, Oct 29 2014 1:55 AM | Last Updated on Thu, Oct 4 2018 8:01 PM

‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే! - Sakshi

‘నల్ల’కుబేరులపేర్లన్నీ ఇవ్వాల్సిందే!

 ‘నల్ల’కుబేరుల విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీం ఫైర్
 ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారంటూ ఘాటు ప్రశ్న
 విదేశాల్లో  ఖాతాలున్న వారిని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు?
 కొందరి పేర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవద్దు
 పూర్తి సమాచారం ఇవ్వండి.. మిగిలినదంతా మేం చూసుకుంటాం
 ఎలా దర్యాప్తు చేయించాలో తమకు తెలుసునని తీవ్ర వ్యాఖ్యలు
 నేడు సీల్డు కవర్‌లో సమర్పించాలని కేంద్రానికి ఆదేశం
 గత తీర్పులో ఒక్క పదాన్ని కూడా మార్చేది లేదని స్పష్టీకరణ
 పూర్తి జాబితా ఇచ్చేందుకు అభ్యంతరం లేదని కేంద్రం ప్రకటన
 దాదాపు 500 మంది పేర్లు అందినట్లు వెల్లడించిన అటార్నీ జనరల్

 
 న్యూఢిల్లీ: నల్లకుబేరుల గుట్టును రట్టు చేసే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న దాగుడుమూతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాల్లో నల్లధనం ఖాతాలున్న వారి పేర్లన్నింటినీ బుధవారానికల్లా తమకు సీల్డు కవరులో సమర్పించాల్సిందేనని మోదీ సర్కారును మంగళవారం ఆదేశించింది. నల్లకుబేరుల జాబితాగా పేర్కొంటూ ఎనిమిది మంది పేర్లతో కూడిన అఫిడవిట్‌ను సోమవారం సుప్రీంకు కేంద్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఇలా కొంతమంది పేర్లనే వెల్లడించి.. మిగతావారి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ మంగళవారంనాటి విచారణ సందర్భంగా కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం నిలదీసింది. దీంతో సుప్రీం ఆదేశాలను పాటిస్తామని, తమ వద్దనున్న మొత్తం పేర్లన్నింటితో పూర్తి జాబితాను కోర్టుకు సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
 
 ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు...
 
 విదేశాల్లో అక్రమంగా నల్లధనం ఖాతాలున్న వారందరి పేర్లు వెల్లడించాలంటూ సుప్రీం గత తీర్పులో కొన్ని మార్పులు చేయాలంటూ కేంద్రం తన తాజా అఫిడవిట్‌లో కోరింది. విదేశీ ఖాతాల్లో పన్ను ఎగవేతలకు సంబంధించి తగిన ప్రాథమిక రుజువులు ఉండి, చట్టపరమైన విచారణ(ప్రాసిక్యూషన్)ను ప్రారంభించిన వారి పేర్లను మాత్రమే బహిర్గతం చేస్తామని అందులో పేర్కొంది. ఇదే విషయాన్ని అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గి కోర్టుకు విన్నవించారు. అయితే, ఈ  కేసును విచారిస్తున్న చీఫ్ జస్టిస్(సీజేఐ) హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మాత్రం కేంద్రం వాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అంతేకాదు, ప్రభుత్వ తీరును తీవ్ర పదజాలంతో ఎండగట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘గత యూపీఏ ప్రభుత్వం మా తీర్పును ఆమోదించింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన సర్కారు నల్లకుబేరుల విషయంలో ఎందుకు ఈ విధమైన ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది. విదేశాల్లో అక్రమంగా బ్యాంకు ఖాతాలున్నవారిని మీరు ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? గతంలో మేం తీర్పును సొలిసిటర్ జనరల్ సమక్షంలోనే వెల్లడించాం. కొత్త ప్రభుత్వం కూడా ఈ తీర్పులో ఎలాంటి మార్పులూ కోరలేదు. ఇప్పుడు మార్పులు అడగడంలో ఔచిత్యమేంటి? మా తీర్పును ఎట్టిపరిస్థితుల్లో సవరించబోం. ఒక్క పదాన్ని కూడా మార్చే ప్రసక్తే లేదు’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ‘మీరేమీ చేయనక్కర్లేదు... విదేశాల్లోని నల్లధనం ఖాతాలకు సంబంధించి మీదగ్గరున్న పేర్లు, సమాచారాన్నంతా కోర్టుకు సమర్పించండి. ఆ తర్వాత దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐ సహా ఎలాంటి సంస్థతో దర్యాప్తు చేయించాలనేది కోర్టు నిర్దేశిస్తుంది’ అని కూడా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ధర్మాసనంలో సీజేఐతోపాటు జస్టిస్ రంజనా ప్రకాశ్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లు ఉన్నారు.
 
 జీవితకాలంలో కూడా దర్యాప్తు పూర్తి చేయలేరు
 
 భారతీయుల విదేశీ ఖాతాలకు సంబంధించి ప్రభుత్వానికి దాదాపు 500 మంది పేర్లు అందాయని అటార్నీ జనరల్ ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఇందులో జర్మనీసహా పలు దేశాల్లోని ఖాతాల వివరాలున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో సీజేఐ కల్పించుకొని.. ‘‘మీరు సొంతంగా ఎలాంటి దర్యాప్తూ జరపాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే గనుక దర్యాప్తు చేస్తే నా జీవితకాలంలో కూడా అది పూర్తికాదు. ఖాతాదార్లకు సంబంధించి కేవలం మీదగ్గరున్న సమాచారాన్నంతా మాకివ్వండి. ఏ విధంగా, ఎవరితో దర్యాప్తు జరిపించాలనేది మేం చూసుకుంటాం’’ అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఖాతాలున్న భారతీయుల తరుఫున వకాల్తా పుచ్చుకోవద్దని, సిట్ అన్ని విషయాలనూ చూసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. ఇలా కొందరు ఖాతాదారుల పేర్లను ఇచ్చి చేతులు దులుపుకోవద్దని హితవు పలికింది. మొత్తం జాబితాను బుధవారం నాడు తమ ముందుంచాలని కుండబద్దలు కొట్టింది. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి వదిలేయలేమని కూడా తేల్చిచెప్పడం గమనార్హం.
 
 ఒప్పించేందుకు ఏజీ విశ్వప్రయత్నం
 
 గత తీర్పులో సవరణకు కోర్టును ఒప్పించేందుకు బలమైన వాదనతో అటార్నీ జనరల్ చాలా ప్రయత్నించారు. ప్రభుత్వం వద్దనున్న మొత్తం పేర్లన్నింటినీ బయటపెడితే.. విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించే ప్రయత్నం దెబ్బతినొచ్చన్నారు. ఇతర దేశాలు తమ వద్దనున్న ఖాతాల సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరించవచ్చని వాదించారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు నియమించిన సిట్ చట్టబద్ధ సంస్థ కాదని, అందువల్ల విదేశీ ఖాతాదారులకు ఎలాంటి నోటీసులూ జారీచేయడం కుదరదని కూడా అటార్నీ వివరించారు. ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ద్వారానే ఇది సాధ్యమవుతుందని.. ఇప్పటికే సమాచారాన్నంతా సిట్‌కు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అయితే, ఆయన వాదనలపట్ల ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ‘విదేశాలు ఇచ్చిన ఖాతాదారుల పేర్లన్నీ మాకు కావాలి. ఆ సమాచారాన్ని మాకు ఇవ్వండి. ఈ కేసును మేం టేకప్ చేసి(సిట్‌కు బదలాయించి).. దాని పర్యవేక్షణను కూడా మేమే చూస్తాం. అంతిమంగా సిట్ ఈ అంశానికి తగిన ముగింపునిస్తుంది. ఈ విషయంలో మీకొచ్చిన ఇబ్బందేంటి?’ అని ప్రశ్నించింది. అయితే, ఖాతాల వివరాల వెల్లడి విషయంలో గోప్యత పాటిస్తామని విదేశీ ప్రభుత్వాలు, సంస్థలకు ప్రభుత్వం హామీనిచ్చిందని కూడా ఏజీ రోహత్గీ కోర్టు దృష్టికి తెచ్చారు. ఒకవేళ అనాలోచితంగా బహిర్గతం చేస్తే... విదేశాలతో పన్ను ఒప్పందాల విషయంలో సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో సమాచార మార్పిడికీ ఇబ్బందులు తప్పవని రోహత్గీ వాదించారు. అయితే, అలాంటి హామీలేవీ మీరు(ప్రభుత్వం) ఇవ్వొద్దని, మన దేశానికి చెందిన సొమ్మును విదేశాలకు తరలించుకుపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేమని కోర్టు తేల్చిచెప్పింది. దీనికోసమే సిట్‌ను ఏర్పాటు చేశామని, అలాంటి ఇబ్బందులేవైనా తలెత్తితే అది చూసుకుంటుందని, ప్రభుత్వం ఇందుకు సహకరించాలని కూడా ధర్మాసనం కుండబద్దలు కొట్టడం గమనార్హం.
 
 చిత్తశుద్ధితో ఉన్నాం
 
  నల్లధనాన్ని భారత్‌కు తిరిగి రప్పించడంలో తమ ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉందని, ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని కేంద్రం పేర్కొంది. ఇందుకు దౌత్యపరంగా, చట్టపరంగా అన్ని అవకాశాలనూ ఉపయోగించుకుంటామని కూడా సుప్రీంకు సమర్పించిన 16 పేజీల అఫిడవిట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. విదేశాల్లో భారతీయులకున్న ప్రతి ఖాతా అక్రమమైనది కాదని కూడా తెలిపింది. ప్రాసిక్యూటబుల్(చట్టప్రకారం విచారణకు అర్హమైన) కేసుల్లో మరింత మంది నల్లకుబేరుల పేర్లను బహిర్గతం చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే దేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రమోటర్ల కుటుంబానికి చెందిన ప్రదీప్ బర్మన్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది నల్లకుబేరుల పేర్లను సోమవారం కేంద్రం బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో రాజ్‌కోట్‌కు చెందిన బులియన్ ట్రేడర్ పంకజ్ చిమన్‌లాల్ లోధియా, గోవా మైనింగ్ కంపెనీ టింబ్లో ప్రైవేట్ లిమిటెడ్, దాని డెరైక్టర్ రాధా సతీశ్ టింబ్లోతో పాటు మరో నలుగురు డెరైక్టర్లు కూడా జాబితాలో ఉన్నారు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలను వీళ్లంతా ఖండించారు. ఇక విదేశాల్లో తమకు ఎలాంటి నల్లధనం ఖాతాలూ లేవని టింబ్లో ప్రైవేటు లిమిటెడ్ డెరైక్టర్ రాధా ఎస్ టింబ్లో మంగళవారం వివరణ ఇచ్చారు. అఫిడవిట్‌లోని అంశాలు కోర్టు పరిధిలోకి వెళ్లాయంటూనే.. తమ వరకైతే అన్ని పన్నులనూ సక్రమంగా చెల్లిస్తున్నామని ఆమె చెప్పారు.
 
 జాబితా నేడు సమర్పిస్తాం: జైట్లీ
 
 నల్లధనం ఖాతాదారుల పేర్లతో కూడిన జాబితానంతటినీ బుధవారం సమర్పిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరణ ఇచ్చారు. ‘ఎవ్వరినీ కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. సుప్రీం చెప్పినట్లుగా సీల్డు కవర్‌లో జాబితాను ఇచ్చేస్తాం. ఇప్పటికే ఈ లిస్టును సుప్రీం నియమించిన సిట్‌కు జూన్ 27నే సమర్పించాం. మేం చట్టప్రకారం నడుచుకుంటాం. కోర్టుకు కూడా జాబితా ఇవ్వడంలో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు’ అని జైట్లీ తేల్చిచెప్పారు. అయితే, ఈ పేర్లన్నింటినీ ప్రభుత్వం ప్రజలకు బహిర్గతం చేస్తుందా లేదా అనేది మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా, విదేశాల్లో అక్రమంగా నల్లధనం పోగేసిన ఖాతాదారులందరినీ శిక్షించాలన్న దృఢనిశ్చయంతో ప్రభుత్వం ఉందని.. నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు సాయశక్తులా కృషిచేస్తామని కూడా జైట్లీ పేర్కొన్నారు. ‘జాబితాలో పేర్లున్న వారి నిగ్గు తేల్చాల్సిందే. అప్పుడే నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు వీలవుతుంది. ఏ సంస్థతో దర్యాప్తు జరిపించినా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ నల్ల మహమ్మారి విషయంలో ఎవరినీ వదలిపెట్టకుండా.. చట్టప్రకారం శిక్షించాలన్న చిత్తశుద్ధితో మా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement