
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి, నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట విధుల్లో ఉన్న ఆ దేశ సైనికుల ఉద్దేశాలు, చర్యల్లో చాలా అంతరం ఉందని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ పాక్ డీజీఎంవో మిర్జాకు తెలిపారు. ఎటువంటి హెచ్చరిక, దాడులు జరగకుండానే భారత బలగాలు సరిహద్దులోని ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయని మిర్జా ఆరోపించడంపై భట్ స్పందించారు. పాక్ సైనిక ప్రధాన కార్యాలయం శాంతిని కోరుకుంటుంటే సరిహద్దులోని ఆ దేశ బలగాలు విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నాయన్నారు.