
కమలంలో కలవరం!
న్యూఢిల్లీ: బిహార్ ఓటమితో బీజేపీలో కలవరం మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాల చక్రాధిపత్యానికి ఎదురుగాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మోదీ వ్యతిరేక వర్గం స్వరం పెంచింది.
పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీతో మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా భేటీకావడం ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయ్యింది. ఈ భేటీలో బిహార్ ఎన్నికల ఫలితాల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్లతో జార్ఖండ్ ఎంపీ గొంతు కలిపారు. ఎన్నికల ప్రచారానికి జనం వచ్చినంత మాత్రాన ఓట్లు పడవని చురకలు అంటించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా బయటి రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రచారం చేస్తే లాభం ఉండదని గ్రహించాలని.. స్థానిక నేతలకే ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత, ఎంపీ కోరారు.
అయితే, ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. మోదీ, అమిత్ షాలను సమర్ధిస్తూ.. గెలుపోటములు సహజమేనని పార్టీ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. గతంలో అద్వానీ హయాంలోనూ పార్టీ ఓడిపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని విమర్శలు చేస్తున్న నేతలకు సూచించారు. బిహార్ ఓటమికి మోదీ, షాలను బాధ్యులను చేయడం సరికాదన్నారు.