సాక్షి, బళ్లారి : సీఎం పీఠంపై మంత్రి డి.కె.శివకుమార్ కన్ను పడిందని బీజేపీ ఎమ్మెల్సీ కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా తాలూకాలోని సంజీవరాయనకోట తదితర ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఓబులేసు తరుఫున ఆయన గురువారం ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... బళ్లారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని, సోనియాగాంధీ వద్ద తన గొప్పలు చెప్పుకోవడం ద్వారా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించి, ఆ స్థానాన్ని తాను కైవసం చేసుకునేందుకు డీకేసీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ కార్యకర్తలకు, ఓటర్లకు డబ్బు ఎరగా చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.