మళ్లీ చేతులు కలిపిన డీఎంకే, కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేయనున్నట్టు వెల్లడి
సాక్షి, చెన్నై: మూడేళ్ల తరువాత కాంగ్రెస్, డీఎంకే పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. డీఎంకే అధినేత కరుణానిధితో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ శనివారమిక్కడ సమావేశమయ్యారు. పొత్తు పునరుద్ధరణపై చర్చించారు. కరుణ నివాసంలో జరిగిన ఈ భేటీలో తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ కూడా పాల్గొన్నారు.
అనంతరం ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలసి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. డీఎంకే సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని, అది నెరవేరుతుందని చెప్పారు. డీఎంకే తమకు నమ్మకమైన మిత్రపక్షమన్నారు. కాంగ్రెస్, డీఎంకేలతోపాటు మరికొన్ని ఇతర పార్టీలూ సంకీర్ణంలో చేరినట్లయితే బలీయమైన శక్తిగా మారుతుందని పేర్కొన్నారు. డీఎంకేతో పొత్తుకు బీజేపీ కూడా యత్నించి, కరుణ, బీజేపీ ఛీఫ్ అమిత్ షాల భేటీకి ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ ఆజాద్‌ను పంపి పొత్తును ఖరారు చేసుకుంది. గతంలో యూపీఏ ప్రభుత్వాల్లో తొమ్మిదేళ్లపాటు డీఎంకే భాగస్వామిగా ఉంది. అయితే శ్రీలంక తమిళుల అంశం విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిందిస్తూ 2013లో యూపీఏ నుంచి వైదొలగడమేగాక కాంగ్రెస్‌తో బంధాన్ని సైతం తెంచుకుంది.