న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కలిగించాలని డిమాండ్ చేస్తూ... ఢిల్లీలో డీఎంకే ఉమెన్స్ వింగ్ ఆందోళన చేపట్టింది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నా 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించకపోవడం దురదృష్టకరమన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలమైన పార్టీలు తమ గొంతు విప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మండి హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకూ ఈ పాదయాత్ర కొనసాగింది. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.