ప్రయాణికులకు శుభవార్త... నగరంలో మెట్రో రైలు సేవలు మరింత విస్తరించనున్నాయి. ఇందుకు కారణం నాలుగో దశ కింద 103.93 కి.మీ మేర మెట్రో మార్గాన్ని నిర్మించనుండడమే. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు సమర్పించింది. సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) నాలుగో దశ మెట్రో మార్గ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులోభాగంగా 103.93 కిమీ పొడవైన మెట్రో మార్గాన్ని నిర్మించనుంది. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను డీఎంఆర్‌సీ... కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖతోపాటు ఢిల్లీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రెండింటి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.
నాలుగవ దశ కింద రిఠాలా నుంచి నరేలా (921.73కిమీ),పశ్చిమ జనక్‌పురి నుంచి ఆర్.కె.ఆశ్రం (28.92కిమీ), ముకుంద్ పురి నుంచి మౌజ్‌పూర్ (12.54 కిమీ), ఇందర్‌లోక్ నుంచి ఇంద్రప్రస్థ ( 12.58 కిమీ), ఏరోసిటీ నుంచి తుగ్లకాబాద్ ( 20. 20 కిమీ), లజ్‌పత్‌నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్ 9 (7.96 కిమీ) వరకు ఆరు కారిడార్లను నిర్మించాలని డీఎంఆర్‌సీ ప్రతిపాదించింది. రిఠాలా- నరేలా వరకు ఉండే కారిడార్ బర్వాలా, బవానాల మీదుగా, పశ్చిమ జనక్‌పురి నుంచి ఆర్‌కెఆశ్రం వరకు ఉండే కారిడార్ పీరాఘడీ మీదుగా ముకుంద్‌పుర్- మౌజ్‌పుర్ కారిడార్ వజీరాబాద్, ఖజూరీఖాస్‌ల మీదుగా, తుగ్లకాబాద్ - ఏరోసిటీ కారిడార్ మెహ్రోలీ, మహీపాల్‌పుర్ గుండా, ఇందర్‌లోక్ - ఇందర్‌బస్తీ కారిడార్ దయాబస్తీ,న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, దిల్లీ గేట్, సచివాలయం మీదుగా నిర్మించాలని డీఎంఆర్‌సీ ప్రతిపాదించింది.
పనులు మొదలుపెట్టిన ప్పటి నుంచి 72 నెలల్లోగా నాలుగోదశ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని డీఎంఆర్‌సీ అంటోంది. 2016, ఏప్రిల్‌లో పనులు ప్రారంభమైతే 2022 మార్చి నాటికి పూర్తవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. నాలుగో దశలో ఆరు కారిడార్లలో 67 మెట్రో స్టేషన్లను నిర్మిస్తారు. ప్రస్తుతం నగరంలో మెట్రో మార్గం 190 కి.మీ పొడవుతో విస్తరించి ఉంది. ప్రతిరోజూ 25 లక్షల మంది ప్రయాణికులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. మూడో దశ మెట్రో నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది. 140 కి.మీల ఈ మెట్రో నిర్మాణం పూర్తయిన తరువాత ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 40 లక్షలకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు. నాలుగో దశ నిర్మాణం తరువాత ఢిల్లీ మెట్రో ప్రయాణికుల సంఖ్య ప్రతిరోజూ 60 లక్షలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
‘మెట్రో’ సేవలు విస్తృతం
Published Sat, Oct 18 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM
Advertisement