కాల్పులకుగ్రీన్ సిగ్నల్
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాల్పులకు డీజీపీ రామానుజం పచ్చ జెండా ఊపారు. నేరాలను అరికట్టే సమయంలో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపవచ్చని ఆయన స్పష్టం చేశారు. అయి తే ఈ ప్రతాపాన్ని అమాయక ప్రజలపై చూపరాదని షరతు విధించారు. తుపాకీ కాల్పులపై తమిళనాడు పోలీసుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు పోటీలు నిర్వహించారు. విజేతలకు డీజీపీ రామానుజం శుక్రవారం బహుమతులను అందజేశారు. అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నేర పరిశోధనలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరును జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని కోరారు.
కాల్పుల పోటీల్లో విజేతలుగా నిలిచివారిని జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు చెప్పారు. తీవ్రవాదులు, రౌడీషీటర్లను అరెస్ట్‌చేసే సమయంలో వారు తిరగబడిన సందర్భాలు అనే కం ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయాల్లో పోలీసు అధికారులు తమ ఆత్మరక్షణ కోసం నేరగాళ్లపై కాల్పులు జరిపితే తప్పులేదని అన్నారు. అయితే తుపాకీ వినియోగంలో తమ నైపుణ్యాన్ని ప్రజల వద్ద ప్రదర్శించరాదని హెచ్చరించారు. కాల్పుల పోటీల్లో విజేతలకు గతంలో రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20వేలు అందజేసేవారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలిత ఈ మొత్తాన్ని పదింతలకు పెంచారని తెలిపారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రూ.2.8 కోట్ల మొత్తాన్ని పోలీసులకు పంచిపెట్టారని ఆయన వెల్లడించారు.
చాంపియన్‌గా సాయుధ పోలీస్ దళం
తుపాకీ కాల్పుల పోటీల్లో రాష్ట్ర సాయుధ పోలీస్ దళం చాంపియన్ షిప్‌ను కైవసం చేసుకుంది. చెన్నై పోలీస్ ద్వితీయ, సెంట్రల్ రిజర్వు పోలీస్ తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత విజేతలుగా పులియంతోపు సహాయ పోలీస్ కమిషనర్ సుధాకర్ 60 మార్కులతో ప్రథమ స్థానం పొందారు. సీబీసీఐడీ ఎస్పీ అన్బు, దక్షిణ చెన్నై రవాణాశాఖ సహాయ కమిషనర్ దినకరన్, ఈ రోడ్డు ఎస్పీ చక్రవర్తిలు 59 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో మొత్తం 210 మంది అధికారులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన 52 మంది అధికారులకు పతకాలు, కప్పులు బహూకరించారు.