తిరువనంతపురం : కరోనా వైరస్ మాటేమో గాని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. తమ వాళ్లను వదిలి మరీ కరోనా సేవలకు అంకితమైన వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం తరచుగా చూస్తున్నాం. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న కంటైన్మెంట్ జోన్‌లో విధులు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్భందికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కంటైన్మెంట్ జోన్‌లో ఉన్న ప్రజలు చేసిన పనికి వారంతా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. (కరోనా భారత్: ఒకే రోజు రెండు రికార్డులు)
వివరాలు.. తిరువనంతపురంలో కంటైన్మెంట్ జోన్‌లో 25 ఏళ్ల ఒక డాక్టర్ తన సిబ్బందితో కలసి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు సిబ్బందితో కూడిన ఆమె బృందం పీహెచ్‌సీ సెంటర్ నుంచి కారులో బయలుదేరారు. కారు కస్లర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి చేరుకోగానే కారులోని వైద్య సిబ్బంది తమతో పాటు తెచ్చుకున్న పీపీఈ కిట్లు ధరించి పరికరాలతో దిగేందుకు సిద్దమయ్యారు. ఇంతలో కారును 50 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆందోళన చేయడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది అని తెలసుకునేలోపే ఇంకా పెద్ద ఎత్తున జనం గూమిగూడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరుస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు.
ఇంతలో కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కారు అద్దాలను దించడంతో ఒక వ్యక్తి తన తలను లోపల పెట్టి గట్టిగా దగ్గుతూ .. ఒకవేళ మాకు కరోనా ఉంటే కచ్చితంగా మీకు కూడ వస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్‌తో పాటు మిగిలిన నలుగురిని కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ సెంటర్‌లో ఉంచారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు)
ఈ సంఘటనపై 25 ఏళ్ల యువ డాక్టర్ మీడియాతో పంచుకున్నారు. 'నా ఎంబీబీఎస్ సంవత్సరం కింద పూర్తయింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న నాకు కరోనా విధులు అప్పగించారు. నాతో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక టెక్నీషియన్‌ను జతచేసి టీంగా రూపొందించి తిరువనంతపురంలోని క్లసర్‌కు కేటాయించారు. రోజువారిలానే విధులు నిర్వహించడానికి శుక్రవారం కూడా కారులో బయలుదేరాము. పీపీఈ కిట్లు ధరించేలోపే మా కారును 50 మంది చుట్టుముట్టి ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కారు విండోను ఓపున్ చేయొద్దని చెప్పా. కాని అనుకోని పరిస్థితుల్లో కారు విండో ఓపెన్ చేయడంతో ఒక వ్యక్తి తన తలను లోపలికి పెట్టి గట్టిగా దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు కూడా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. కారులో నాతో పాటు వచ్చిన ఒక నర్సు కంటతడి పెట్టింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాం. ఇప్పుడు మేమంతా క్వారంటైన్‌లో ఉన్నాం. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ విధులకు హాజరవుతాం. చూద్దాం ఏం జరుగుతుందో ' అంటూ డాక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు.
మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిని ఇలా అవమానపరచడం దారుణమని పేర్కొంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలతో పాటు జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా సంఘటనపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిపై ఇలా ప్రవర్తించడం దారుణమని, కరోనా నేథ్యంలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటివి జరగకూడదని కెకె. శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు సూచించామని ఆమె తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్‌లో ఉండడంతో అక్కడి ప్రజలు స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యవసరాల సరుకులు మినహా మరెక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విదించడంతో వారంతా ఇలా తమ అసహనం వ్యక్తం చేశారని మంత్రి శైలజ మరో ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment