తిరువనంతపురం: భారత దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదయ్యింది. అయితే ఆ తరువాత అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఆ విషయంలో దేశం మొత్తం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల జల్లులు కురిపించాయి. అయితే ఇప్పుడు పినరయి విజయన్, ఇండియాలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పదిలక్షలకు చేరువులో ఉంది, 25,000 మంది వరకు కరోనాతో మరణించారు. అయినా కూడా భారత ప్రభుత్వం దేశంలో సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రకటించలేదు. అయితే భారత్‌లో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించడం సంచలనంగా మారింది.
పినరయి విజయన్, తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందన్నారు. పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
చదవండి: కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?
శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వారిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. 42 మందికి వైరస్ ఎక్కడి నుంచి వైరస్ సోకిందో అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఈ విషయాన్ని వెల్లడించిన పినరయి విజయన్, తిరువనంతపురంలో కరోనా కట్టడిలో భాగంగా జూలై నెల 6 నుంచి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment