
పోస్టర్ ఎఫెక్ట్: రాహుల్ లేచారు!!
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేనట్లుగా విభిన్నంగా ప్రవర్తించారు.
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేనట్లుగా విభిన్నంగా ప్రవర్తించారు. ఇంతకుముందు ధరల పెరుగుదల అంశంపై పార్లమెంటులో వాడి వేడిగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా హాయిగా నిద్రపోయిన రాహుల్ గాంధీ.. బుధవారం మాత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళనకు నేతృత్వం వహించారు. ఏకంగా వెల్లోకి దూసుకెళ్లి మరీ నినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్లో మతకలహాలపై సభ దద్దరిల్లింది. మతఘర్షణలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభలో వెల్లోకి దూసుకెళ్లారు. స్పీకర్ సుమిత్రా మహాజన్పైనా ఆరోపణలు చేశారు.సభను ఏకపక్షంగా నడుపుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు.
దీనంతటికీ కారణం ఏంటా అని రాజకీయ పండితులు చాలాసేపు తలలు కొట్టుకుని ఆలోచించారు. అసలు కారణం చివరకు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తినడం, చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా రెండంకెల స్థానానికి పడిపోవడం, చివరకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఉత్తరప్రదేశ్లో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాల్సింది ఇక ప్రియాంకా గాంధీయేనంటూ అందులో పేర్కొన్నారు. ఆ పోస్టర్లలో అయితే సోనియా గాంధీ, ప్రియాంకల ఫొటోలు ఉన్నాయి గానీ, ఎక్కడా రాహుల్ ప్రస్తావన కూడా లేదు.
ఇలాగే కొనసాగితే తనను క్రమంగా రాజకీయాలకు దూరం చేస్తారేమోనన్న బెంగ యువరాజుకు పట్టుకున్నట్లుంది. అందుకే తన ఉనికిని చాటుకోడానికి ఆయన ఒక్కసారిగా లోక్సభలో వీరావేశం ప్రదర్శించారు. ఎప్పుడూ లేనట్లుగా ఏకంగా స్పీకర్ మీద కూడా ఆరోపణలు చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ కూడా తీవ్రమైన ఆవేశంతోనే కనిపించారు. సభలో కేవలం ఒక్కళ్ల గొంతు మాత్రమే (ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి) వినిపిస్తోందని, అసలు ప్రతిపక్షాల గొంతు వినకూడదన్నది ప్రభుత్వం తీరులా ఉందని ఆయన అన్నారు. గతంలో ఎన్నికల ప్రచారంలో కూడా కొంతవరకు బీజేపీపై మండిపడినా, ఎన్నికల తర్వాత మాత్రం యువరాజు గొంతు ఇంతలా వినిపించడం ఇదే తొలిసారి. బహుశా ఇదంతా పోస్టర్ల ఎఫెక్టేనేమో!!