ప్రద్యుమన్ కేసు.. అదే అధికారుల తప్పు
ప్రద్యుమన్ కేసు.. అదే అధికారుల తప్పు
Published Sat, Sep 16 2017 10:59 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM
సాక్షి, ఛండీగఢ్: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ప్రాణాలు కోల్పోయాడన్నది తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో స్కూళ్ల భద్రతా చర్యలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ప్రద్యుమన్ ఇంటికి వెళ్లి మరి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. సీఎం ఖట్టర్, బాలుడి ఇంటికి రాక ముందు డాగ్ స్క్వాడ్‌తో గుర్‌గ్రామ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు విచారణలో మాత్రం డాగ్ స్క్వాడ్ ను ఎందుకు వినియోగించలేదన్న ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ‘హత్య జరిగిన స్కూల్ టాయ్‌లెట్‌లోకి డీసీసీతో సహా పలువురు అధికారులు వెళ్లి పరిశీలించారు. వారితోపాటు క్లూస్ టీం కూడా పైపైనే ఆధారాలు సేకరించింది. ఇలాంటి కేసుల్లో డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించాలన్న కనీస ఆలోచనను కూడా అధికారులు చేయలేదు. ఆ లెక్కన్న కేసుపై వాళ్లు ఎంత శ్రద్ధగా పని చేశారో అర్థమౌతోంది’ అని బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అధికారులు పెద్ద తప్పు చేశారని.. ఒకవేళ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఉండి ఉంటే కేసులో వెలుగు చూడని బోలెడు విషయాలు బయటపడేవి కావొచ్చని వారు అంటున్నారు. బాలుడి హత్య తర్వాత ఘటనా స్థలిని శుభ్రం చేసేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారులు డాగ్ స్క్వాడ్ టీంలో ఒకే ఒక్క శునకాన్ని వాడుతుండటంపై కూడా విమర్శిస్తున్నారు. ప్రద్యుమ్న హత్యకు గురైన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, మూడు నెలల పాటు నిర్వహించేందుకు ముందు వచ్చిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement