Pradyuman Murder Case
-
ప్రద్యుమ్న కేసులో మరో మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ర్యాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్య కేసు మరో మలుపు తిరిగింది. అతడిని హత్య చేసిన 11వ తరగతి విద్యార్థిని వయోజనుడిగానే పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. అతడు తప్పనిసరిగా ఇతర ఖైదీల మాదిరిగానే కోర్టుకు తీసుకురావచ్చని స్పష్టం చేసింది. శుక్రవారం అతడిని కోర్టు తీసుకురావాలని, ఆ రోజు నేరం చేసినట్లు రుజువైతే అతడికి 21 ఏళ్లు నిండే వరకు బాల నేరస్తుల గృహంలో ఉంచి ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పాఠశాల బస్ కండక్టర్ ఈ హత్య చేసినట్లు తొలుత భావించినా అతడిని దోషిగా చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది. అనంతరం చేసిన దర్యాప్తులో ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేసినట్లు గుర్తించాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్ కండక్టర్ అశోక్‌ను అరెస్టు చేశారు. కాగా, సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని ఆ సమయంలో చెప్పగా వారి విజ్ఞప్తి మేరకు అతడిని యుక్తవయస్కుడిగానే గుర్తించి విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
మరో షాక్... ప్రద్యుమన్‌ను అతనూ చంపలేదా?
సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారి ప్రద్యుమన్ హత్యకేసులో మరో మలుపు. హత్య చేశాడని అరెస్ట్ చేసిన మైనర్ హర్యానా పోలీసులు, సీబీఐపై సంచలన ఆరోపణలు చేశాడు. బలవంతంగా తనతో నేరాన్ని ఒప్పించారని అతను చెబుతున్నాడు. హిందుస్థాన్ టైమ్స్.. ఇండియా టుడే కథనాల ప్రకారం... సీబీఐ అధికారి రేణు సాయిని సోమవారం బాలుడిని కలిసి రెండు గంటలు మాట్లాడారు. ఆ సంభాషణలో అతను వివరాలు వెల్లడించినట్లు ఆయా కథనాలు పేర్కొన్నాయి. సీబీఐ, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి ఒత్తిడి మేరకే తాను చెయ్యని నేరాన్ని అంగీకరించినట్లు బాలుడు తెలిపాడు. విచారణ పేరిట తనను ఇష్టం వచ్చినట్లు కొట్టారని.. బలవంతంగా తను నుంచి నేరాన్ని ఒప్పుకున్నట్లు స్టేట్మెంట్ రికార్డు చేయించారని వివరించాడు. సీబీఐ అధికారులు కూడా దూషిస్తూ తనతో దురుసుగా ప్రవర్తించారని చెప్పాడు. హత్య జరిగిన తీరును సీబీఐ విచారించటం.. తనను అరెస్ట్ చేసిన విధానం రెండూ వేర్వేరుగా ఉన్నాయని అతను వాదిస్తున్నాడు. తాను అమాయకుడినని.. అనవసరంగా తనను కేసులో ఇరికించారని తెలిపాడు. మరోవైపు అతని తల్లిదండ్రులు కూడా బాలుడి అరెస్ట్ తర్వాత ఇదే వాదనను వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి... ఆ కారణంతోనే చంపాడా? అయితే సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన సీబీఐ మాత్రం మైనర్ పైనే అనుమానం వ్యక్తం చేస్తోంది. దర్యాప్తు ముందుకు వెళ్తుంటే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులూ చెబుతున్నారు. మరోవైపు నేరం తీవ్రత దృష్ట్యా నిందితుడిని మేజర్‌గా భావించాలంటూ ప్రద్యుమన్ తల్లిదండ్రులు కోర్టుకు విన్నవిస్తున్నారు. ఒకవేళ కోర్టు వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుంటే గరిష్ఠంగా మూడేళ్లు.. తీసుకుంటే మాత్రం అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే ప్రద్యుమన్ కేసును విచారించిన పోలీసులు ర్యాన్ స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్‌ను ఇరికించాలని యత్నించటం.. దానిని ఉన్నతాధికారుల ముందు ఒప్పుకోవటం సంచలనం సృష్టించింది. -
ప్రద్యుమ్న హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
-
షాకింగ్ ట్విస్ట్.. పరీక్షలు వాయిదా వేయించేందుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుంది. పరీక్షలు వాయిదా వేసేందుకు అతడు చిన్నారి ప్రద్యుమ్నను హత్య చేసినట్టు కథనాలు వస్తున్నాయి. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని గతంలో పేర్కొనగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని సీబీఐ అంటోంది. గుర్గావ్లోని ప్రముఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో సెప్టెంబర్ 8న ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్ కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నస్కూల్ సీఈవో ర్యాన్ పింటో, అతని తల్లిదండ్రులు, స్కూల్ ఫౌండింగ్ చైర్మన్ అయిన ఆగస్టిన్ పింటో, ఎండీ గ్రేస్ పింటోలకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అదుపులోకి తీసుకున్న విద్యార్థికి ప్రద్యుమ్న హత్యకు సంబంధం ఏమిటి? అన్నది దర్యాప్తు సంస్థ ఇంకా స్పష్టం చేయడం లేదు. మరోవైపు తమ కొడుకు అమాయకుడని, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని విద్యార్థి తల్లిండ్రులు అంటున్నారు. ‘సీబీఐ మంగళవారం రాత్రి నా కొడుకును అదుపులోకి తీసుకుంది. అతడు ఈ నేరాన్ని చేయలేదు. కేవలం గార్డెనర్‌కు, టీజర్లకు జరిగిన దారుణం గురించి చెప్పాడంతే’ అని విద్యార్థి తండ్రి తెలిపారు. కాగా, సీబీఐ బుధవారం అతన్ని జువైనెల్ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రద్యుమ్న ఠాకూర్‌ను తానే హత్యచేసినట్టు ర్యాన్ స్కూల్ బస్ డ్రైవర్ అశోక్ కుమార్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. కానీ అశోక్‌కుమార్ కుటుంబసభ్యులు మాత్రం అతన్ని కావాలనే ఇరికించారని ఆరోపిస్తున్నారు. -
ప్రద్యుమన్ కేసు.. అదే అధికారుల తప్పు
సాక్షి, ఛండీగఢ్: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ప్రాణాలు కోల్పోయాడన్నది తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో స్కూళ్ల భద్రతా చర్యలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ప్రద్యుమన్ ఇంటికి వెళ్లి మరి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. సీఎం ఖట్టర్, బాలుడి ఇంటికి రాక ముందు డాగ్ స్క్వాడ్‌తో గుర్‌గ్రామ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు విచారణలో మాత్రం డాగ్ స్క్వాడ్ ను ఎందుకు వినియోగించలేదన్న ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ‘హత్య జరిగిన స్కూల్ టాయ్లెట్లోకి డీసీసీతో సహా పలువురు అధికారులు వెళ్లి పరిశీలించారు. వారితోపాటు క్లూస్ టీం కూడా పైపైనే ఆధారాలు సేకరించింది. ఇలాంటి కేసుల్లో డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించాలన్న కనీస ఆలోచనను కూడా అధికారులు చేయలేదు. ఆ లెక్కన్న కేసుపై వాళ్లు ఎంత శ్రద్ధగా పని చేశారో అర్థమౌతోంది’ అని బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులు పెద్ద తప్పు చేశారని.. ఒకవేళ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఉండి ఉంటే కేసులో వెలుగు చూడని బోలెడు విషయాలు బయటపడేవి కావొచ్చని వారు అంటున్నారు. బాలుడి హత్య తర్వాత ఘటనా స్థలిని శుభ్రం చేసేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారులు డాగ్ స్క్వాడ్ టీంలో ఒకే ఒక్క శునకాన్ని వాడుతుండటంపై కూడా విమర్శిస్తున్నారు. ప్రద్యుమ్న హత్యకు గురైన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, మూడు నెలల పాటు నిర్వహించేందుకు ముందు వచ్చిన విషయం తెలిసిందే.